Amaravathi : మౌనంగా ఎదుగుతోన్న `అమరావతి`
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని ఎంత నిర్లక్ష్యం చేసినప్పటికీ అక్కడ పునాదులను కదిలించలేకపోయారు.
- Author : CS Rao
Date : 03-09-2022 - 1:34 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని ఎంత నిర్లక్ష్యం చేసినప్పటికీ అక్కడ పునాదులను కదిలించలేకపోయారు. అంతేకాదు, ఆనాడు చంద్రబాబు వేసిన అమరావతి బీజం మౌనంగా ఎదుగుతోంది. హైకోర్టు ఆదేశాలను కనీస స్థాయిలో జగన్ అమలు చేయకపోయినప్పటికీ ఒక రూపానికి అమరావతి వస్తోంది.
మూడు రాజధానులను వైసీపీ పరిచయం చేసింది. దాన్నే అమలు చేస్తామని ఇప్పటికీ చెబుతోంది. ఎన్నికల ముందే మూడు రాజధానులు ఉంటాయని మంత్రి అమర్నాథ్ రెడ్డి తాజాగా చెబుతున్నారు. అమరావతి రాజధాని ముగిసిపోయిన అధ్యాయంగా వైసీపీ పలుమార్లు చెప్పింది. మూడు రాజధానుల బిల్లును మాత్రం ఉపసంహరించుకుంది. ఇప్పుడు ఏపీ రాజధాని ఏది అంటే హైదరాబాద్ అంటూ మంత్రి బొత్సా చెబుతున్నారు. కానీ, కేంద్రం విడుదల చేసిన కొన్ని నిధులను అమరావతి కోసం అనివార్యంగా కొన్ని నిధులను ఏపీ సర్కార్ కేటాయించింది. ఆ నిధులతోనే అమరావతి మౌనంగా ఎదుగుతూ ఉంది.

అమరావతి ముఖచిత్రాన్ని టీడీపీ సానుభూతిపరులు తాజాగా వాట్సప్ గ్రూప్ ల్లో పెడుతున్నారు. అక్కడి నిర్మాణాలు ఏ స్టేజ్ లో ఉన్నాయో తెలియచేస్తూ వివరాలను వైరల్ చేస్తున్నారు. గ్రూప్ ల్లో తిరుగుతోన్న మెసేజ్ లను గమనిస్తే అమరావతి నిర్మాణం నత్తనడకన నడుస్తుందని అర్థం అవుతోంది. పూర్తిగా నిలిచిపోలేదని బోధపడుతోంది. అంతేకాదు, అమరావతిలోని కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. ఆయా సంస్థలకు కేటాయించిన భవనాల్లో కార్యకలాపాలు జరుగుతున్నాయి. వీటిని చూస్తే అమరావతిని ఎవరూ చంపలేరని స్పష్టం అవుతోంది.