AP Budget 2024: ఏపీ బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఘాటు వ్యాఖ్యలు..
వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఏపీ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనేక పథకాలు ప్రకటించినా, వాటికి బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించలేదని ఆరోపించారు. రైతులకు హామీ ఇచ్చిన రూ. 20 వేల బడ్జెట్‌లో కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, అలాగే ఇతర పథకాలకు నిధులు సరిపోలేదని ఆమె మండిపడ్డారు.
- By Kode Mohan Sai Published Date - 05:48 PM, Mon - 11 November 24

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆమె, కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాటు ఒటాన్ బడ్జెట్ అమలు చేసి, దేశ చరిత్రలోనే ఎవరూ చేయని చెత్తరికార్డును నెలకొల్పిందన్నారు. “ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా” అన్నట్లు కూటమి బడ్జెట్ ఉందని, ఎన్నో పథకాలు ప్రకటించినప్పటికీ, వాటికి నిధులు కేటాయించలేదన్నారు. ప్రజలను మోసం చేసినట్లు కూటమి ప్రభుత్వం పాలనపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
రైతులకు ప్రతి సంవత్సరం 20వేలు ఇస్తామని మాటలు చెప్పారు కానీ, కేవలం రూ.5 వేల కోట్లే నిధులు కేటాయించారని ఆమె ఆరోపించారు. అలాగే, “తల్లికి వందనం” పథకానికి కేవలం రూ.5300 కోట్లు కేటాయించడం ఏ మూలకూ సరిపోదని ఆమె చెప్పారు. ఈ బడ్జెట్ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానంకి, నిధుల కేటాయింపు లోపం మరియు పథకాల అమలులో గందరగోళం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఏపీ బడ్జెట్‌పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర విమర్శలు:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సగం సగం కేటాయించి ప్రజలను మభ్యపెడుతున్నది అన్నారు.
మహాశక్తి పథకం కింద మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ, ఆ పథకానికి నిధులు కేటాయించలేదన్నారు. అలాగే, 50 లక్షల నిరుద్యోగులకు నెలకు 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, నిధుల కేటాయింపు లేదు అని ఆమె ప్రశ్నించారు.
ఉచిత బస్సు సౌకర్యం కోసం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని, ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు కూడా నిధులు కేటాయించలేదని చెప్పారు.
వాలంటీర్లకు గౌరవ వేతనం రూ. 10 వేల వరకు పెంచాలని హామీ ఇచ్చినప్పటికీ, ఆ పెంపుదల గురించి కూడా ఏది స్పష్టత లేదని అన్నారు. రైతుల పంటలకు ధరల స్థిరీకరణ నిధికి సంబంధించిన అంశం కూడా బడ్జెట్‌లో గుర్తించబడలేదు అని ఆమె ప్రశ్నించారు. లారీ, ఆటో, టాక్సీ డ్రైవర్లకు, మత్స్యకారుల భరోసా పథకానికి కూడా నిధులు కేటాయించలేదని ఆమె ప్రశ్నించారు.
ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం అనుచితంగా మభ్యపెడుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. ప్రజలను నిట్టనిలువుగా మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరాటం చేస్తుందంటూ ఆమె స్పష్టం చేశారు.