AP Assembly : ఫిబ్రవరి 27 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. 15 రోజుల పాటు జరిగే అవకాశం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్
- By Prasad Published Date - 08:22 AM, Sun - 19 February 23

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా నియమితులైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పదిహేను రోజుల పాటు సభ జరిగే అవకాశం ఉంది. విశాఖకు సీఎం క్యాంప్ ఆఫీస్ మారుస్తామంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనతో ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాల్లో వైజాగ్ తరలివేళ్లేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు 16 మంది ఎమ్మెల్సీలు ఎన్నిక అవుతుండటంతో శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ బలం పెరుగుతుంది. దీంతో త్వరలో ముఖ్యమంత్రి మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తూ దాదాపు ముగ్గురు మంత్రులను తప్పించనున్నట్లు సమాచారం. కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన ముఖ్యమంత్రి జగన్ జాబితాను ఖరారు చేశారని.. సోమవారం జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధమవుతున్నారు.