Ukraine – Vijayawada: ఉక్రెయిన్ యుద్ధానికి, విజయవాడకు లింకేమిటి?
ఉక్రెయిన్ యుద్ధానికి, విజయవాడ మార్కెట్‌కు ఏమైనా డైరెక్ట్ లింక్ ఉందా? అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న తమ పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆందోళన కొందరిలో ఉంటోందే తప్ప, మొత్తం మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితులు ఇప్పటికైతే కనిపించడం లేదు.
- By Hashtag U Published Date - 09:52 AM, Sun - 27 February 22

ఉక్రెయిన్ యుద్ధానికి, విజయవాడ మార్కెట్‌కు ఏమైనా డైరెక్ట్ లింక్ ఉందా? అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న తమ పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆందోళన కొందరిలో ఉంటోందే తప్ప, మొత్తం మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితులు ఇప్పటికైతే కనిపించడం లేదు. అయినా అలాంటి లింకును కొందరు వ్యాపారులు సృష్టిస్తున్నారు.
విజయవాడ మార్కెట్‌లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. స్టాక్ మార్కెట్‌లో షేర్ల మాదిరిగా ఉదయం ఒక రేటు, సాయంత్రానికి మరో రేటు పలికింది.
ఉక్రెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొనే సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు పెరిగిందంటే సరేలే అని సరిపెట్టుకోవచ్చు. దానితో సంబంధం లేని పామాయిల్, దేశంలోనే దొరికే వేరుసెనగ నూనె ధరలు కూడా పెరిగిపోయాయి.
ఇదేమని అడిగితే ఉక్రెయిన్ యుద్ధమని సమాధానం చెబుతున్నారు. హోల్‌సేల్ వారు పెంచారు కాబట్టి, తామూ పెంచకతప్పలేదని రిటెయిలర్లు అంటున్నారు.
ఉక్రెయిన్‌లో అలా యుద్ధం ప్రారంభయిందో లేదో విజయవాడలోని ఓ మాల్‌లో పామాయిల్ ధర పెరిగింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు లీటరు రేటు రూ.128 ఉండగా, 12 గంటలకు రూ.149 పలికింది. కేవలం రెండు గంటల్లోనే రూ.21 పెరిగింది. పామాయిల్ మలేషియా నుంచి దిగుమతి అవుతుంది. యుద్ధంతో ఆ దేశానికి సంబంధం లేకున్నా ఇక్కడ రేట్లు పెంచేశారు.
సన్‌ఫ్లవర్ నూనె రేట్లను ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు. రూ.160-180 మధ్య లీటరు పలుకుతోంది. అక్కడ నుంచి దిగుమతులు ఆగిపోయే పరిస్థితులు ఉంటే రేట్లు పెంచినా అర్థం ఉంటుందుగానీ, ఇప్పుడు ఇంపోర్ట్ అయిన సరకుపై పెంచడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి.
నూనె రేట్లు అదుపులో లేకపోతే టిఫిన్స్, స్నాక్స్ ధరలు పెంచే పరిస్థితి వస్తుందేమోనని హోటళ్లు, తోపుడు బండ్లవారు అంటున్నారు. నూనె ధరలు పెరిగితే సామాన్యుడి వంటింటికి ఆ సెగ తగులుతుంది.