Andhra Teacher: మోడీ మెచ్చిన ‘ఆంధ్రా’ ఆచార్య!
ప్రధాని నరేంద్ర మోదీ "మన్ కీ బాత్ " లో ప్రతిసారీ ఒక కొత్త విషయం ఉంటుంది.
- By Balu J Published Date - 01:50 PM, Mon - 30 May 22

ప్రధాని నరేంద్ర మోదీ “మన్ కీ బాత్ ” లో ప్రతిసారీ ఒక కొత్త విషయం ఉంటుంది. ఆదివారం ఉదయం నాటి మన్ కీ బాత్ ప్రోగ్రాం కూడా వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే.. అందులో ఒక తెలుగు వ్యక్తి పేరును మోడీ ప్రస్తావించారు. ఆయనే ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన విశ్రాంత హెడ్ మాస్టర్ రామ్ భూపాల్ రెడ్డి. ఇంతకీ ఆయన్ని మోడీ ఎందుకు మెచ్చుకున్నారో తెలుసా ? ఎవరైనా రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులతో ఇల్లు కట్టుకుంటారు.. బంగారం కొనుక్కుంటారు.. కానీ రామ్ భూపాల్ రెడ్డి అలా చేయలేదు. అంత సంకుచితంగా ఆలోచించలేదు. రిటైర్మెంట్ కాగానే వచ్చిన రూ. 25.71 లక్షలను ఒక మంచి పనికి వాడారు. తమ ఊరిలోని 88 మంది 10 ఏళ్లకు పైబడిన నిరుపేద బాలికలకు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఓపెన్ చేయించారు.
వారి ఖాతాల్లోనే ఆ పాతిక లక్షలు డిపాజిట్ చేయించారు. ఆ బాలికలను చదువుల్లో ప్రోత్సహించాలనే ఏకైక లక్ష్యంతో ఈ పని చేశారాయన. ఆ 88 మంది బాలికలకు 21 ఏళ్ళు నిండే వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి చెరో రూ.41000 వడ్డీ ఆ బాలికల ఖాతాల్లో జమ అయ్యే ఏర్పాటు చేశారు. యడవల్లి జిల్లా పరిషత్ పాఠశాల లో ఆయన హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు. తల్లిదండ్రుల పేదరికం కారణంగా ఎంతోమంది ప్రతిభావంతులైన బాలికలు మధ్యలోనే చదువు మానేయడాన్ని ఆయన గుర్తించారు. అలాంటి కొంతమందికైనా మంచి జీవితం ఇవ్వాలనే సంకల్పంతో తన రిటైర్మెంట్ డబ్బులను విరాళం గా ఇచ్చేశారు.