Aerial survey : బుడమేరులో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే
Flood Affected Areas: ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్‌లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్.. కేంద్ర మంత్రికి వివరించారు.
- Author : Latha Suma
Date : 05-09-2024 - 6:16 IST
Published By : Hashtagu Telugu Desk
Shivraj Singh Chouhan Visit Flood Affected Areas: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడ (Vijayawada)లో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్‌లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్.. కేంద్ర మంత్రికి వివరించారు.
ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టం పై కేంద్ర మంత్రికి వివరణ..
ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించనున్నారు. అనంతరం జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టర్టీ ప్రాంతాన్ని ఎన్డీఆర్ఎఫ్ బోట్‌లో వెళ్లి పరిశీలించనున్నారు. విజయవాడ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరుకుని వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి తిలకించనున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే సుజనాచౌదరి తదితరులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు.
ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర బృందం..
మరోవైపు ఏపీలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి చేరుకుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేయనుంది. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకోనుంది.
ఈ క్రమంలోనే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను అధికారులు వారికి వివరించారు. అనంతరం వారు ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను కేంద్ర బృందం పరిశీలించింది. బ్యారేజీ ప్రవాహం ఇతర వివరాలను కేంద్ర బృందానికి జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు వివరించడంతో పాటు అందుకు సంబంధించిన వివరాలను వారికి వివరించారు.