Balineni Vs Chevireddy : అదానీ అంశం.. చెవిరెడ్డి, బాలినేని వాగ్వాదం
తాను సంతకం చేయటానికి నిరాకరించానన్నారు. ఆ తర్వాతి రోజు కేబినెట్ భేటీలో సెకీ ఒప్పందాన్ని ఆమోదించారని బాలినేని పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 09:26 PM, Mon - 25 November 24

Balineni Vs Chevireddy : ఒకప్పుడు వైఎస్‌ఆర్‌సీపీలో కలిసి పనిచేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. అయితే అదానీ సంస్థపై అమెరికాలో నమోదైన కేసు.. జగన్ హయాంలో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అంశంలో ఆరోపణలు వస్తూండటంతో తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కేంద్రం పరిధిలోని సెకీతో ఒప్పందం తన ప్రమేయం లేకుండా జరిగిందని బాలినేని అన్నారు. సెకీతో ఒప్పందం సమయంలో తనను అర్ధరాత్రి నిద్ర లేపి సంతకం చేయమన్నారన్నారు. ఆ తర్వాతి రోజు కేబినెట్ సమావేశం ఉండగా…అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి సెకీతో ఒప్పందం ఫైల్ పైన సంతకం చేయాలని కోరారన్నారు. అయితే తాను సంతకం చేయటానికి నిరాకరించానన్నారు. ఆ తర్వాతి రోజు కేబినెట్ భేటీలో సెకీ ఒప్పందాన్ని ఆమోదించారని బాలినేని పేర్కొన్నారు.
మరోవైపు బాలినేని ఆరోపణల్ని ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఖండిస్తున్నారు. జగన్ ను బాలినేని మోసం చేశారని అంటున్నారు. బ్లాక్ మెయిల్ చేశారని అయినా జగన్ భరించారని అంటున్నారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని చేసిన వ్యాఖ్యలు ఎవరూ హర్షించరన్నారు. బాలినేని ఇంతలా దిగజారిపోతారని ఊహించలేదన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం బాలినేని ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. బాలినేని మాటలు చూస్తుంటే అబద్ధాలు ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో యూనిట్ కు రూ.4.50 చొప్పున ఒప్పందాలు చేసుకుంటే.. జగన్ హయాంలో దానిని రూ.2.48 తగ్గించారన్నారు. బాలినేని జనసేనలో చేరాక…ఆ పార్టీ వాళ్ల మెప్పు కోసం ఇలా మాట్లాడి ఉండవచ్చన్నారు. వైఎస్ జగన్‌ను తిడితే జనసేనలో మెచ్చుకుంటారని బాలినేని మరింత దిగజారి మాట్లాడుతున్నారన్నారు.
కాగా, వైఎస్ జగన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అమెరికాలోని న్యాయ స్థానం వారిపై అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను నాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Chaganti Koteswara Rao: సీఎం చంద్రబాబుతో చాగంటి కోటేశ్వరరావు భేటి