Sharmila: అన్నమయ్య ఇక అనాథ ప్రాజెక్టేనా?: వైఎస్ షర్మిల
అలాగే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.
- By Gopichand Published Date - 08:35 PM, Mon - 1 September 25

Sharmila: అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఐదు సంవత్సరాలు గడిచినా, పునర్నిర్మాణానికి దిక్కులేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ‘అనాథ ప్రాజెక్ట్’గా మార్చివేశాయని ఆమె విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు దుర్ఘటనలో 39 మందిని బలిగొన్న ఈ ఘోర విపత్తులో జరిగిన నష్టాన్ని పూడ్చే మనసు ప్రభుత్వాలకు లేదని ఆమె ఆవేదన చెందారు. ఐదు గ్రామాలు కొట్టుకుపోయినా పునరావాసానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, సర్వం కోల్పోయిన నిరాశ్రయులను నేటికీ ఆదుకున్నది లేదని ఆమె అన్నారు.
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ. 800 కోట్లతో మరమ్మత్తులు చేస్తామని హడావిడి చేశారే తప్ప ప్రాజెక్టును కట్టింది లేదని వైఎస్ షర్మిల అన్నారు. పునరుద్ధరణ పేరుతో మూడు ఏళ్లు గడిపారే తప్పా, తట్టెడు మట్టి కూడా వేయలేదని ఆమె దుయ్యబట్టారు. బాధిత కుటుంబాలకు ఇళ్లు అందలేదని, చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు దక్కలేదని పేర్కొన్నారు. ఇసుక మాఫియాతో ప్రాజెక్టుకు గండి పడితే అసెంబ్లీ వేదికగా హై లెవెల్ కమిటీలు, దర్యాప్తు అంటూ జగన్ కాలయాపన చేశారే తప్పా ఉద్ధరించింది శూన్యమని విమర్శించారు.
Also Read: Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బలపర్చాలి: మంత్రి
అలాగే అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాజంపేటకు రెండు సార్లు వచ్చిపోయినా ప్రాజెక్టు పనులకు మోక్షం లభించలేదని, రూ. 340 కోట్లతో మరమ్మత్తులు అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. డ్యామ్ నిర్మాణం కోసం సర్వేల పేరుతో సీఎం చంద్రబాబు కూడా కాలయాపన చేస్తున్నారని షర్మిల అన్నారు. రాజంపేట వేదికగా మళ్లీ మాయమాటలు చెప్పారు తప్ప ప్రాజెక్టు నిర్మాణంపై దిశా నిర్దేశం లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు. అన్నమయ్య కన్నీటి వ్యధకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా నీటి నిల్వ లేక 30 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదని, లక్ష మందికి తాగునీరు లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పూర్తి స్థాయి నిధులు కేటాయించి అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేయాలని, డ్యామ్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు హామీల మేరకు పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు షర్మిల తెలిపారు.