లోకేష్ పుట్టిన రోజు సందర్బంగా తిరుమల శ్రీవారికి రూ.44 లక్షలు విరాళం ఇచ్చిన అభిమాని
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల సేవా దృక్పథం మరోసారి చాటుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు, ప్రముఖులు స్వామివారికి భారీ విరాళాలు సమర్పించారు
- Author : Sudheer
Date : 23-01-2026 - 10:45 IST
Published By : Hashtagu Telugu Desk
Nara Lokesh Birthday : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల సేవా దృక్పథం మరోసారి చాటుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు, ప్రముఖులు స్వామివారికి భారీ విరాళాలు సమర్పించారు. తిరుమలలో ప్రతిరోజూ వేలాదిమంది భక్తులకు జరిగే అన్నప్రసాద వితరణ కోసం భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ముందుకు రావడం విశేషం. లోకేష్ జన్మదినం సందర్భంగా ఒకరోజు మొత్తం అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చును తానే భరించాలని నిర్ణయించుకున్న ఆయన, టీటీడీకి భారీ మొత్తాన్ని అందజేశారు.
భాష్యం రామకృష్ణ గురువారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి రూ.44 లక్షల విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను అందజేశారు. జనవరి 23న నారా లోకేష్ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున శ్రీవారిని దర్శించుకునే భక్తులందరికీ తన విరాళం ద్వారా అన్నప్రసాద వితరణ జరగాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా దాత రామకృష్ణను టీటీడీ చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రముఖుల పుట్టినరోజుల వేళ ఇలాంటి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు.

Lokesh Bday 2026
మరోవైపు, అదే రోజున చిత్తూరుకు చెందిన చింతల దివ్యాంత్ రెడ్డి అనే భక్తుడు కూడా తన ఉదారతను చాటుకున్నారు. టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆయన రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ఈ విరాళం అందజేశారు. ఇలా ఒకవైపు అన్నప్రసాదం, మరోవైపు వైద్య సేవలకు భక్తులు విరాళాలు అందించడం పట్ల టీటీడీ హర్షం వ్యక్తం చేసింది. భక్తుల నుంచి వచ్చే ఇటువంటి విరాళాలే టీటీడీ నిర్వహిస్తున్న అనేక ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తున్నాయి.
మరోపక్క లోకేష్ పుట్టిన రోజు సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవ కార్యక్రమాలు చేస్తూ లోకేష్ పై అభిమానం చాటుకుంటున్నారు అభిమానులు , పార్టీ శ్రేణులు. ఇక రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం లోకేష్ కు బర్త్ డే విషెష్ ను అందజేస్తున్నారు.