Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?
- By Vamsi Chowdary Korata Published Date - 12:38 PM, Fri - 24 October 25
కర్నూలు బస్సు ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు.. ప్రమాదంలో దగ్ధమైన బస్సులోంచి 19 మృతదేహాలను బయటకు తీశాయి. అయితే ఈ ప్రమాదంలో 30 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. మిగతా వారి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.
వారి ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో సూరారంలో ఇద్దరు, జేఎన్‌టీయూ వద్ద ముగ్గురు ప్రయాణికులు ఎక్కినట్లు తెలుస్తోంది. ఇందులో సూరారం వద్ద ఎక్కిన గుణసాయి కిటికీలోంచి దూకి ప్రాణాలు రక్షించుకోగా.. మరో వ్యక్తి ప్రశాంత్ ఫోన్ సిచ్చాఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జేఎన్‌టీయూ వద్ద ఎక్కిన ముగ్గురిలో.. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్లు సమాచారం. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
చనిపోయిన వారు వీరే..
- ఎం.సత్యనారాయణ – సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
- జయసూర్య – మియాపూర్, హైదరాబాద్
- నవీన్ కుమార్ – హయత్‌నగర్, హైదరాబాద్
- సరస్వతీ, నిహారిక – బెంగళూరు
- నీలకుర్తి రమేశ్, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తె జస్విత, కుమారుడు అభిరామ్ – కొత్తపేట, నెల్లూరు జిల్లా
- కాపరి అశోక్, కాపరి శ్రీహర్ష – నెల్లూరు
వీరితో పాటు చనిపోయిన మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో ఉన్న ట్రావెల్స్ కార్యాలయం నుంచి గురువారం రాత్రి 9 గంటలకు బెంగళూరుకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే బస్సులో మంటలు చెలరేగాయి.
ఓ బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బస్సు కిందకు బైక్ దుసుకెళ్లడంతో.. పెట్రోల్ లీక్ అయ్యి మంటలు రాజుకున్నట్లు.. తర్వాత బస్సు మొత్తం వ్యాపించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
బస్సు ప్రమాదానికి గురైన సమయంలో.. స్థానికులు వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరగ్గానే అటుగా వెళ్తున్న ఓ మహిళ.. వీడియో తీసి, పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. వీడియో పోలీసులకు షేర్ చేయడంతో.. వారు ప్రమాద తీవ్రతను గుర్తించి.. వెంటనే అన్ని విభాగాలనూ అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే అదే మార్గంలో వెళ్తున్న ఓ వ్యక్తి.. గాయపడిన ఓ వ్యక్తిని తన కారులో ఎక్కించుకుని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.