Zelensky : ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలు కీలక దశలో.. వాషింగ్టన్‌లో జెలెన్‌స్కీ భేటీలు
Zelensky: ఉక్రెయిన్‌లో రెండేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా జరుగుతున్న దౌత్యపరమైన కసరత్తు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది.
- By Kavya Krishna Published Date - 02:10 PM, Mon - 18 August 25

Zelensky: ఉక్రెయిన్‌లో రెండేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా జరుగుతున్న దౌత్యపరమైన కసరత్తు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. రష్యాపై ఒత్తిడి పెంచి, శాశ్వత శాంతి సాధించే లక్ష్యంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సోమవారం వాషింగ్టన్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరప్ అగ్రనేతలతో జరపనున్న భేటీపై అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగింది.
వాషింగ్టన్ చేరుకున్న వెంటనే సోషల్ మీడియా వేదిక ఎక్స్లో జెలెన్‌స్కీ తన సందేశాన్ని పంచుకున్నారు. “ఈ యుద్ధాన్ని వేగంగా, నమ్మకంగా ముగించాలనే ఆకాంక్ష మా అందరిలో ఉంది. కానీ ఈ శాంతి గతంలోని పొరపాట్లలా తాత్కాలికం కాకూడదు. 1994లో విఫలమైన భద్రతా హామీల మాదిరిగా లేదా క్రిమియా, డాన్‌బాస్‌లను వదులుకోవాల్సి వచ్చిన పరిస్థితిలా మళ్లీ జరగరాదు” అని స్పష్టం చేశారు. అయితే ఈ సమావేశంపై యూరప్ దేశాల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిమాండ్లకు అనుగుణంగా కొన్ని రాయితీలు ఇచ్చేలా ట్రంప్ ఒత్తిడి తేవచ్చని వారిలో అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రిమియాపై ఉక్రెయిన్ హక్కులను వదులుకోవడం, నాటోలో చేరబోమని హామీ ఇవ్వడం వంటి షరతులను ముందుకు తెచ్చే ప్రయత్నం జరిగే అవకాశం ఉందని యూరోపియన్ దౌత్యవర్గాలు భావిస్తున్నాయి.
Krishna Ashtami : కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. కరెంట్ షాక్ తో ఐదుగురు దుర్మరణం
ఈ కారణంగా జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా వాషింగ్టన్ చేరుకున్నారు. అమెరికా వైఖరిని సమీపంగా గమనించడం, ఉక్రెయిన్‌కు నమ్మదగిన భద్రతా హామీలు లభించేలా చూడడం తమ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మాట్లాడుతూ, “మనం ఇప్పుడు రష్యా ముందు బలహీనంగా కనబడితే, అది భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలకు పునాది వేసినట్లే అవుతుంది” అని హెచ్చరించారు. జర్మనీ ప్రభుత్వం కూడా ఒక ప్రకటనలో, ఉక్రెయిన్‌కు దీర్ఘకాలిక భద్రతా హామీలు, సైనిక సహాయం, ఆర్థిక మద్దతు, రష్యాపై ఆంక్షల ఒత్తిడి ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో ఉంటాయని పేర్కొంది.
ఇక సైనిక రంగంలో, డొనెట్స్క్, సుమీ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం విజయాలను సాధిస్తున్నదని జెలెన్‌స్కీ తెలిపారు. ఈ క్రమంలో తమకు మద్దతు ఇస్తున్న అమెరికా, యూరప్ దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. “ఈ యుద్ధంలో మిత్రదేశాల సహాయం లేకపోతే, మనం ఇంతకాలం నిలబడలేము” అని గుర్తుచేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ సమావేశం ద్వారా అమెరికా వైఖరి, యూరప్ మద్దతు స్పష్టంగా వెలువడనుంది. ఉక్రెయిన్ శాశ్వత శాంతి దిశగా ముందుకు సాగుతుందా? లేక రష్యా షరతులు మళ్లీ అడ్డంకులుగా మారతాయా? అన్న దానిపై అంతర్జాతీయ దృష్టి వాషింగ్టన్‌లో జరగనున్న చర్చలపై కేంద్రీకృతమైంది.
NTR : ఎన్టీఆర్ ను చూసి భయపడుతున్నారా ? – అంబటి