Krishna Ashtami : కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. కరెంట్ షాక్ తో ఐదుగురు దుర్మరణం
Krishna Ashtami : శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న శోభాయాత్రలో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు
- By Sudheer Published Date - 08:45 AM, Mon - 18 August 25

కృష్ణాష్టమి పండుగ రోజున హైదరాబాద్(Hyderabad)లో విషాదం చోటుచేసుకుంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న శోభాయాత్రలో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన రామాంతపూర్‌లోని గోకుల్ నగర్‌లో జరిగింది. ఈ దుర్ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పండుగ సంబరాల మధ్య జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
Number Plate: దేశంలో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ కాస్ట్ ఎంతో తెలుసా?!
ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.. శ్రీ కృష్ణ శోభాయాత్ర సందర్భంగా రథాన్ని ఊరేగిస్తుండగా, అది అనుకోకుండా పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో రథంలో ఉన్నవారికి, దానిని లాగుతున్నవారికి విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను శ్రీ కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, రుద్రవికాస్, రాజేంద్రరెడ్డిలుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పండుగ సంబరాల్లో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరమని స్థానికులు, అధికారులు తమ విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.