US Pauses Visas For Foreign Truck Drivers : ట్రక్ డ్రైవర్లకు అమెరికా ప్రభుత్వం షాక్
US Pauses Visas For Foreign Truck Drivers : గతవారం భారతీయ డ్రైవర్ హర్జిందర్ సింగ్ నిర్లక్ష్యంగా ట్రక్ నడపడం వల్ల ఫ్లోరిడా హైవేపై ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఈ నిర్ణయానికి దారితీసింది
- Author : Sudheer
Date : 22-08-2025 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికా రోడ్డు భద్రతా పరిరక్షణలో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల నుంచి ట్రక్ డ్రైవర్లకు వీసాలు జారీ చేయబోమని ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. గతవారం భారతీయ డ్రైవర్ హర్జిందర్ సింగ్ నిర్లక్ష్యంగా ట్రక్ నడపడం వల్ల ఫ్లోరిడా హైవేపై ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఈ నిర్ణయానికి దారితీసింది. 2018లో అక్రమంగా మెక్సికో బోర్డర్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించిన అతను, కాలిఫోర్నియాలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎలా సాధ్యమైంది అనే ప్రశ్నలు లేవడంతో, ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.
విదేశాల నుంచి వచ్చే డ్రైవర్లు సరైన నిబంధనలు పాటించడం లేదని, ముఖ్యంగా అక్రమ వలసదారులు తక్కువ జీతాలకు ఉద్యోగాలు పొందుతూ, అక్రమ లైసెన్సులు సంపాదిస్తున్నారని అధికారులు గుర్తించారు. రోడ్లపై ఉన్న సూచనలు చదవలేకపోవడం, ఇంగ్లిష్ రాకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, దీంతో అమెరికన్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, స్థానిక ట్రక్ డ్రైవర్ల జీవనోపాధి కూడా దెబ్బతింటోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పేర్కొన్నారు.
Mega157 : వింటేజ్ లుక్ లో ‘మన శంకర వరప్రసాద్ ‘ అదరగొట్టాడు
ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చిన ప్రభుత్వం, ఇకపై విదేశీ ట్రక్ డ్రైవర్లకు వీసాలు ఇవ్వబోమని, లైసెన్స్ పొందాలంటే ఇంగ్లిష్ చదవడం, రాయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అంతేకాకుండా, నిబంధనలు పాటించని డ్రైవర్లకు లైసెన్స్ ఇస్తే ట్రక్కు యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రోడ్డు భద్రతను కాపాడడమే కాకుండా, అమెరికా ట్రక్కర్ల జీవనోపాధిని రక్షించడం కూడా ఈ నిర్ణయ వెనుక ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. అయితే, ఈ ఆంక్షలతో అమెరికాలో ట్రక్ డ్రైవర్ల కొరత ఏర్పడే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.