China: చైనాను కుదిపేస్తున్న టైఫూన్ ‘బావి’ తుపాను
- Author : Vamsi Chowdary Korata
Date : 15-07-2026 - 10:25 IST
Published By : Hashtagu Telugu Desk
‘బావి’ తుఫాను ధాటికి చైనాలోని చెంగ్దే, గ్వాంగ్జీ వంటి కీలక ప్రాంతాలు జలమయమయ్యాయి. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, ఎడతెరిపి లేకుండా కురిసిన క్లౌడ్‌బర్స్ట్ (మేఘమథనం) తరహా వర్షాల కారణంగా ప్రధాన రహదారులన్నీ నదులను తలపించాయి. నివాస సముదాయాల బయట, రోడ్లపై పార్క్ చేసిన వందలాది కార్లు, ఇతర వాహనాలు వరద ఉధృతికి కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో (నెట్టింట) వైరల్‌గా మారి తుఫాను తీవ్రతను కళ్ళకు కడుతున్నాయి. వందలాది ఇళ్ళు, వ్యాపార సముదాయాల్లోకి వరద నీరు చేరడంతో వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది.
ఈ తుఫాను సృష్టించిన బీభత్సం వల్ల చెంగ్దే మరియు గ్వాంగ్జీ పరిసర ప్రాంతాలలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ, నివాస ప్రాంతాలు, వీధులు అడుగుల మేర మందపాటి బురద మరియు కొట్టుకొచ్చిన శిథిలాలతో కూరుకుపోయాయి. విద్యుత్ సరఫరా, తాగునీటి వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు పూర్తిగా తెగిపోయాయి. ప్రస్తుతం స్థానిక ప్రజలతో పాటు చైనా విపత్తు నిర్వహణ మరియు రక్షణ సహాయక బృందాలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి యుద్ధప్రతిపాదికన బురదను తొలగిస్తున్నాయి. రహదారులను శుభ్రం చేస్తూ, విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.