Netanyahu Statement: ఇకపై పాలస్తీనా దేశం ఉండదు : నెతన్యాహు హెచ్చరిక
ఇకపై జోర్డాన్ నది పశ్చిమ తీరంలో పాలస్తీనా రాజ్యం ఉండదని, తమ దేశం మధ్యలో ఉగ్రవాదులకు స్థానం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
- By Dinesh Akula Published Date - 12:50 PM, Mon - 22 September 25

Netanyahu Statement: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలు పాలస్తీనాను దేశంగా గుర్తించినట్లు ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది హమాస్ ఉగ్రదాడికి బహుమతి ఇచ్చినట్లు ఉందని నెతన్యాహు విమర్శించారు.
ఇకపై జోర్డాన్ నది పశ్చిమ తీరంలో పాలస్తీనా రాజ్యం ఉండదని, తమ దేశం మధ్యలో ఉగ్రవాదులకు స్థానం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితులపై ప్రపంచం రానున్న రోజుల్లో తమ మాట వినాల్సి వస్తుందని పేర్కొన్నారు. త్వరలో జరుగనున్న అమెరికా పర్యటన అనంతరం ఇజ్రాయెల్ అధికారికంగా తన ప్రతిస్పందనను ప్రకటిస్తుందని తెలిపారు. ఈ విషయాలపై నెతన్యాహు ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.
יש לי מסר ברור לאותם מנהיגים שמכירים במדינה פלסטינית לאחר הטבח הנורא ב-7 באוקטובר: pic.twitter.com/YhrfEHjRhZ
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) September 21, 2025
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడులతో గాజాలో మానవతా సంక్షోభం తీవ్రమవుతుండటంతో, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు ఆదివారం ప్రకటించాయి. ఇప్పటికే భారత్, చైనా, రష్యా సహా 147 దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. ఇక ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో ఫ్రాన్స్, పోర్చుగల్ వంటి దేశాలు కూడా త్వరలో గుర్తించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అమెరికా మాత్రం పాలస్తీనా దేశ గుర్తింపుకు వ్యతిరేకంగా ఉంది. ఒకవేళ ఇదే జరిగితే హమాస్ ఉగ్రవాద సంస్థ మరింత బలపడుతుందని హెచ్చరించింది. ఇటీవల బ్రిటన్ పర్యటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా స్టార్మర్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ చర్యలపై భారత్ మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. పాలస్తీనా అంశంలో కేంద్ర ప్రభుత్వం నిశ్చలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, ప్రియాంకా గాంధీ లు 1988లో భారత్ అధికారికంగా పాలస్తీనాను దేశంగా గుర్తించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పటి మౌనాన్ని తప్పుబట్టారు.
ఇదిలా ఉండగా, గాజాలో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్నాయి. అక్టోబర్ 7న హమాస్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ భారీగా బదులిచ్చింది. హజార్ల కొద్దీ పౌరులు మరణించారు. ఈ నేపథ్యంలో పాలస్తీనా రాష్ట్ర స్థితిపై ప్రపంచదేశాలు రెండు వైపులుగా విడిపోయాయి.