శాంతి చర్చలు విఫలం.. కారణం నెతన్యాహు ఫోన్ కాల్?!
ఈ దౌత్యపరమైన వైఫల్యం అమెరికా, దాని మిత్రదేశాల మధ్య పెరుగుతున్న విభేదాలను బట్టబయలు చేసింది.
- Author : Gopi
Date : 12-04-2026 - 11:33 IST
Published By : Hashtagu Telugu Desk
Netanyahu Call: అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు హఠాత్తుగా విఫలమయ్యాయి. చర్చలు ఒక పెద్ద నిర్ణయం దిశగా సాగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌కు ఫోన్ చేశారని ఇరాన్ పేర్కొంది. ఈ ఒక్క ఫోన్ కాల్ తర్వాత అమెరికా వైఖరి పూర్తిగా మారిపోయిందని, చర్చలు ఇరాన్-అమెరికా శాంతి నుంచి ఇజ్రాయెల్ ప్రయోజనాల వైపు మళ్లాయని ఆరోపించింది. యుద్ధభూమిలో సాధించలేని అంశాలను అమెరికా చర్చల ద్వారా సాధించాలని చూస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘచీ విమర్శించారు. జెడి వాన్స్ ఎటువంటి ఒప్పందం లేకుండా పాకిస్థాన్‌ను వీడటంతో, ఇప్పుడు గల్ఫ్ దేశాలలో ఉద్రిక్తత గరిష్ట స్థాయికి చేరుకుంది.
అమెరికా షరతులు – ఇరాన్ తిరస్కరణ
ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు జరిగిన సుదీర్ఘ మారథాన్ సమావేశంలో అమెరికా కొన్ని కఠినమైన షరతులను విధించింది. వీటిని అంగీకరించేందుకు ఇరాన్ ససేమిరా అంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండా ఓడల రాకపోకలకు అనుమతించడంతో పాటు, తన యురేనియం సుసంపన్నత కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని వాషింగ్టన్ కోరింది. జెడి వాన్స్ దీనిని అమెరికా “చివరి, ఉత్తమ ప్రతిపాదన”గా పేర్కొన్నప్పటికీ ఇరాన్ మాత్రం దీనిని తమ సార్వభౌమాధికారానికి వ్యతిరేకమని భావించింది. తాము చిత్తశుద్ధితో చర్చలకు వచ్చామని, కానీ అమెరికా మొండి వైఖరి ఒప్పందానికి అడ్డంకిగా మారిందని ఇరాన్ పేర్కొంది.
Also Read: హిస్టరీ క్రియేట్ చేసిన కింగ్ కోహ్లీ!
ముడి చమురు ధరలకు మళ్లీ రెక్కలు?
శాంతి చర్చలు విఫలమవ్వడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. యుద్ధ విరామం ముగియడానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉండటం, ఒప్పందం ఆశలు సన్నగిల్లడంతో ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. గతంలో కాల్పుల విరమణ జరిగినప్పుడు 95 డాలర్లకు పడిపోయిన చమురు ధర, ఇప్పుడు మళ్లీ 100 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇరాన్ ఇప్పటికే హోర్ముజ్ జలసంధి వద్ద డ్రోన్లు, క్షిపణులను మోహరించడంతో వాణిజ్య నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి మెరుగుపడకపోతే ప్రపంచ ఇంధన సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది.
సొంత మిత్రదేశాల మధ్యే ఏకాకిగా అమెరికా
ఈ దౌత్యపరమైన వైఫల్యం అమెరికా, దాని మిత్రదేశాల మధ్య పెరుగుతున్న విభేదాలను బట్టబయలు చేసింది. ఇరాన్‌పై ఎటువంటి సైనిక చర్యకైనా తమ గగనతలం లేదా భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి స్పెయిన్, ఇటలీ వంటి దేశాలు నిరాకరించాయి. యుద్ధంలో పాల్గొనాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇస్తున్న ఒత్తిడిని అనేక నాటో (NATO) సభ్య దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు పూర్వపు మిత్రదేశాలుగా ఉన్న వారు కూడా ఈసారి వెనక్కి తగ్గుతున్నారు. ఫలితంగా అమెరికా అంతర్జాతీయ స్థాయిలో ఏకాకిగా మారుతుండగా, ఇరాన్ మాత్రం తన సరిహద్దుల రక్షణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.