Israel Vs Hamas : గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిలోకి ఇజ్రాయెల్ ఆర్మీ
Israel Vs Hamas : గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ కీలకమైన ఆపరేషన్‌ను మొదలుపెట్టింది.
- By Pasha Published Date - 10:02 AM, Wed - 15 November 23

Israel Vs Hamas : గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ కీలకమైన ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. ఉత్తర గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్ షిఫా హాస్పిటల్‌లో ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశించింది. ఆస్పత్రిలోని అన్ని గదులు, సెల్లార్‌లలో తనిఖీలు చేస్తోంది. సెల్లార్ భాగంలో.. దాని కింద.. హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు ఉండొచ్చనే అనుమానంతో సోదాలు చేస్తోంది. మరోవైపు ఆస్పత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైనికుల మధ్య కాల్పులు, ప్రతికాల్పులు జరుగుతున్నాయి.
ఈనేపథ్యంలో అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన విడుదల చేసింది. అల్ షిఫా ఆస్పత్రిపై దాడి చేయొద్దని స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా, వినకుండా ఆ ఆస్పత్రిలో ఇజ్రాయెల్ ఆర్మీ దాడికి దిగడంపై వైట్ హౌస్ స్పందించింది. ఆస్పత్రి లోపల సైనిక దాడులు జరపకూడదని ఇజ్రాయెల్‌కు హితవు పలికింది. ఆస్పత్రులపై వైమానిక దాడులను కూడా ఆపేయాలని సూచించింది. ఇటువంటి చర్యలను అమెరికా సమర్ధించబోదని వైట్ హౌస్ వెల్లడించింది.మరోవైపు ఇదే అంశంపై హమాస్ ఘాటుగా స్పందించింది. అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ లభించబట్టే అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడికి తెగబడిందని హమాస్(Israel Vs Hamas) ఆరోపించింది.
Also Read: Rain Alert Today : బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలోని ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్