Crimea Storm : అంధకారంలో లక్షలాది మంది.. రష్యా, ఉక్రెయిన్, క్రిమియాలలో తుఫాను
Crimea Storm : రష్యా కబ్జాలో ఉన్న క్రిమియా ప్రాంతంలో తుఫానుతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
- By Pasha Published Date - 12:41 PM, Tue - 28 November 23
Crimea Storm : రష్యా కబ్జాలో ఉన్న క్రిమియా ప్రాంతంలో తుఫానుతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాల తీగలు తెగిపోవడంతో 5లక్షల మందికిపైగా ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. తుఫాను కారణంగా క్రిమియాలో నలుగురు చనిపోయారు. నల్ల సముద్రంలో ఈ తుఫాను ఏర్పడిందని గుర్తించారు. తుఫాను తీరం దాటే క్రమంలో గంటకు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయని వెల్లడించారు. గత 16 ఏళ్లలో ఈ తరహాలో గాలులు ఎన్నడూ వీయలేదని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక క్రిమియా పొరుగునే ఉన్న ఉక్రెయిన్ తీర ప్రాంతాల్లోనూ కరెంటు తీగలు తెగి, దాదాపు 1.50 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దాదాపు 1500 గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ఇక్కడ వివిధ ఘటనల్లో ఐదుగురు చనిపోయారు. దక్షిణ రష్యాలోని తీర ప్రాంతాలపైనా ఈ తుఫాను ఎఫెక్ట్ పడింది. కొన్ని చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఒకచోట ఒక వ్యక్తి చనిపోయాడు. తుఫాను ప్రభావంతో మాల్దోవాలో మరో ముగ్గురు(Crimea Storm) చనిపోయారు.