Roman Starovoit : రష్యా మాజీ మంత్రి రోమన్ స్టారోవోయిట్ ఆత్మహత్య
Roman Starovoit : మాస్కో నగర శివారులో ఆయన తన వ్యక్తిగత కారులో తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్టు రష్యన్ అధికార వర్గాలు వెల్లడించాయి
- By Sudheer Published Date - 10:00 PM, Mon - 7 July 25

రష్యాలో కేంద్ర రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్టారోవోయిట్ (Roman Starovoit) తన పదవీ బహిష్కరణ తర్వాత కొన్ని గంటలలోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. మాస్కో నగర శివారులో ఆయన తన వ్యక్తిగత కారులో తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్టు రష్యన్ అధికార వర్గాలు వెల్లడించాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ ఆయనను పదవి నుంచి తొలగించిన తర్వాత ఈ ఘటన జరిగింది. రష్యా దర్యాప్తు కమిటీ విడుదల చేసిన ప్రకటనలో “రష్యా రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్టారోవోయిట్ తన కారులో తుపాకీ తో కాల్చుకొని చనిపోయాడని” పేర్కొన్నారు. ఆయనను తొలగించిన ప్రకటన వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దీనిపై పూర్తి విచారణ జరిపేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణలో నిర్వహించండి
రోమన్ స్టారోవోయిట్‌ను మే 2024లో రవాణా మంత్రిగా పుతిన్ నియమించారు. అప్పటి వరకు ఆయన ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంగా ఉన్న కుర్స్క్ ప్రాంతానికి గవర్నర్‌గా సుమారు ఐదేళ్లు పనిచేశారు. జులై 6న విడుదలైన అధికారిక ఉత్తర్వులు ప్రకారం ఆయనను పదవి నుంచి తొలగించిన విషయాన్ని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలగింపుకు కారణం ఎక్కడా తెలుపలేదు. కానీ ఇటీవల రష్యాలో గగనతల, నౌకాశ్రయాల్లో చోటుచేసుకున్న గందరగోళాలే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. జూలై 5–6 తేదీల్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని ప్రధాన విమానాశ్రయాల్లో 300కి పైగా విమానాలు రద్దయ్యాయి.
CM Revanth Reddy : తెలంగాణలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో
దీనివల్ల మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ సహా కీలక నగరాల్లో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అదే సమయంలో జులై 6న లెనిన్‌గ్రాడ్ ఓబ్లాస్త్‌లోని ఉస్ట్-లూగా పోర్ట్‌లో ఒక టాంకర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా అమోనియా గ్యాస్ లీక్ కావడంతో అత్యవసర చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఈ పరిణామాలు రవాణా మంత్రిత్వ శాఖపై తీవ్ర ఒత్తిడిని పెంచినట్లు భావిస్తున్నారు. రోమన్ స్టారోవోయిట్‌ను తప్పించిన తరువాత నవోగ్రేడ్ ప్రాంతానికి మాజీ గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తిని అండ్రే నికిటిన్‌ను కొత్త రవాణా మంత్రిగా నియమితులయ్యారు. కాగా రోమన్ స్టారోవోయిట్ ను పదవి నుంచి తప్పించడం, పరువు నష్టం, రాజకీయ ఒత్తిళ్లు ఇవన్నీ కలిపి ఆత్మహత్యకు దారి తీసి ఉండొచ్చని అంతరింగిక వర్గాలు చెబుతున్నాయి.