Nuclear Weapons : భారీగా అణ్వాయుధాలు రెడీ చేయండి.. కిమ్ సంచలన ఆర్డర్స్
ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. యుద్ధ ప్రాతిపదికన అణ్వాయుధాలను(Nuclear Weapons) పెద్దసంఖ్యలో తయారు చేయాలనే ఆర్డర్స్ జారీ చేశారు.
- By Pasha Published Date - 11:44 AM, Mon - 18 November 24

Nuclear Weapons : కొరియా ద్వీపకల్పంలో అణ్వస్త్ర యుద్ధం జరగబోతోందా ? దక్షిణ కొరియాలో ఉన్న అమెరికా సైన్యాలను ఉత్తర కొరియా టార్గెట్ చేయబోతోందా ? అనే భయాలు ప్రస్తుతం అలుముకున్నాయి. దీనికి కారణం.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ చేసిన తాజా ప్రకటన. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో అణ్వాయుధాలను రెడీ చేయాలని ఆర్మీకి ఆయన సంచలన ఆదేశాలు జారీ చేశారు. జపాన్‌తో కలిసి ‘ఆసియా నాటో’ కూటమిని ఏర్పాటు చేయాలని దక్షిణ కొరియా భావిస్తోంది. దీనిపై జపాన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది. ‘ఆసియా నాటో’ కూటమిని ఏర్పాటు చేసుకుంటే.. దక్షిణ కొరియా, జపాన్‌లకు కలిపి అణ్వస్త్రాలను ఇచ్చేందుకు అమెరికా రెడీ అయిందనే ప్రచారం జరుగుతోంది.
కిమ్ అలర్ట్..
ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. యుద్ధ ప్రాతిపదికన అణ్వాయుధాలను(Nuclear Weapons) పెద్దసంఖ్యలో తయారు చేయాలనే ఆర్డర్స్ జారీ చేశారు. ‘ఆసియా నాటో’ ఏర్పాటైతే ఉత్తరకొరియా ఉనికికి ముప్పు ఉంటుందని కిమ్ వాదిస్తున్నారు. ఇప్పటికే రష్యా, ఉత్తర కొరియాలు నాటో తరహా కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం.. ఉత్తర కొరియాపై ఏ దేశమైనా దాడి చేస్తే, దానిపై ఉత్తరకొరియా, రష్యా కలిసి దాడి చేస్తాయి. ఈ ఒప్పందాన్ని కౌంటర్ చేసేందుకే.. జపాన్, దక్షిణ కొరియాలు కలిసి ఆసియా నాటో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇందులో అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది.
Also Read :Secretariat Vastu : రూ.3 కోట్లతో తెలంగాణ సచివాలయంలో చేస్తున్న వాస్తు మార్పులివీ..
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా శత్రుదేశం రష్యాకు కిమ్ చేరువ అవుతున్నారు. రష్యా నుంచి ఇప్పటికే ఉత్తర కొరియాకు కీలకమైన శాటిలైట్లు, మిస్సైళ్లు, డ్రోన్లను తయారు చేసే టెక్నాలజీలు అందాయి. అణ్వస్త్ర తయారీ టెక్నాలజీ సైతం రష్యా నుంచి ఉత్తర కొరియాకు అందే అవకాశాలు ఉన్నాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఉత్తర కొరియా త్వరలోనే న్యూక్లియర్ బాంబును పరీక్షించే అవకాశం ఉందని ఇటీవలే దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించాయి.వేల కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ధ్వంసం చేయగల లాంగ్ రేంజ్ మిస్సైళ్లు ఇప్పటికే ఉత్తర కొరియా అమ్ములపొదిలో ఉన్నాయి. ఇంతగా సాయం చేస్తున్నందు వల్లే రష్యాకు దాదాపు 3వేల సైనికులను కిమ్ పంపారు.