NASA-ISRO Mission : నేడే నింగిలోకి NISAR.. ఎలా పనిచేస్తుందంటే?
NASA-ISRO Mission : శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి GSLV-F16 రాకెట్ ద్వారా దీన్ని 747 కిలోమీటర్ల ఎత్తులోని భూమి కక్ష్యలో ప్రవేశపెడతారు
- Author : Sudheer
Date : 30-07-2025 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రపంచాన్ని కదిలించే విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో NASA (అమెరికా) మరియు ISRO (భారతదేశం) కలసి చేపట్టిన అతిపెద్ద శాటిలైట్ మిషన్ NISAR (NASA-ISRO Synthetic Aperture Radar) నేడు నింగిలోకి ప్రయాణించనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి GSLV-F16 రాకెట్ ద్వారా దీన్ని 747 కిలోమీటర్ల ఎత్తులోని భూమి కక్ష్యలో ప్రవేశపెడతారు. ఇది దాదాపు 2,392 కిలోల బరువుతో తయారవ్వగా, ఇది భూమిపై ప్రకృతి విపత్తుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఈ శాటిలైట్ పని విధానం:
NISAR శాటిలైట్ రాడార్ సాంకేతికతను ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. ఇది భూమిని 24 గంటలు నిరంతరం స్కాన్ చేస్తూ, అత్యంత సూక్ష్మ స్థాయిలో మార్పులను గుర్తించగలదు. భూమిపై ఒక అంగుళం మేర కదలికలు జరిగినా తేడాను గుర్తించగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఇది ప్రధానంగా రెండు తరంగదైర్ఘ్యాల – L-బ్యాండ్ (NASA) మరియు S-బ్యాండ్ (ISRO) రాడార్లను కలిగి ఉంటుంది, వీటితో భూమిపై చలనాలను అంచనా వేయగలదు.
ఈ శాటిలైట్ ముఖ్యంగా తుఫాన్లు, సునామీలు, కార్చిచ్చులు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపాల తర్వాత కొండచరియలు విరిగిపడే అవకాశాలు వంటి విపత్తులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రోజులో 12 నుంచి 14 రివిజిట్లతో భూమి ఉపరితలాన్ని తిరిగి తిరిగి పర్యవేక్షిస్తుంది. ఈ డేటా భూ వైశాల్యం మార్పులపై, పంటల పెరుగుదలపై, మరియు విపత్తుల నిర్వహణలో పాలకులకు, శాస్త్రవేత్తలకు అపార ఉపయోగం చేకూర్చుతుంది.
ఈ మిషన్ ద్వారా భారత్‌కు అత్యాధునిక భూగ్రహ అన్వేషణ శక్తి లభించనుంది. ఇది కేవలం ప్రకృతి విపత్తులకు సంబంధించి కాకుండా, పర్యావరణ మార్పులు, హిమనదాల కరుగుదల, అడవుల తగ్గుదల, పంటల పుట్టుబడి వంటి అనేక అంశాలపై వివరాలందిస్తుంది. ఈ మిషన్‌లో భారత్ కీలక భాగస్వామిగా ఉండటం, దేశానికి అంతర్జాతీయ ఖగోళ పరిశోధనల్లో ప్రాధాన్యతను మరింత పెంచుతోంది. NISAR మిషన్ విజయం ద్వారా భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ భాగస్వామ్యాలకు నాంది పలకనుంది.
Jagan : కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొస్తున్న జగన్