Military Day Parade : చైనాలో కుమార్తెతో కిమ్..వారసత్వ సంకేతాలు స్పష్టమవుతున్నాయా?
కిమ్‌తో విదేశీ పర్యటనకు ఆమె రావడం ఇదే మొదటిసారి కావడంతో ఇది ఉన్ తన వారసత్వ సంకేతాలను స్పష్టంగా తెలియజేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుంది.
- Author : Latha Suma
Date : 03-09-2025 - 11:10 IST
Published By : Hashtagu Telugu Desk
Military Day Parade : ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల చైనాలో జరిగిన మిలిటరీ డే పరేడ్‌కు హాజరై మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అయితే ఈసారి ఆయన ఒంటరిగా కాదు తన కుమార్తె కిమ్-జు-యేను కూడా వెంట తీసుకువచ్చారు. కిమ్‌తో విదేశీ పర్యటనకు ఆమె రావడం ఇదే మొదటిసారి కావడంతో ఇది ఉన్ తన వారసత్వ సంకేతాలను స్పష్టంగా తెలియజేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుంది. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌పై చైనా సాధించిన విజయానికి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా బీజింగ్‌లో చైనా ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సైనిక పరేడ్, ఆయుధ ప్రదర్శనలో కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. ఆయన బుల్లెట్ ప్రూఫ్ రైలులో బీజింగ్‌కు చేరుకోగా, ఆ రైలులోనే కుమార్తె కిమ్-జు-యే కూడా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది.
Read Also: Gold Price: పసిడికి రెక్కలు..మళ్లీ రికార్డుల దిశగా దూసుకెళ్తున్న ధర
కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను ప్రజలకు పరిచయం చేసిన సందర్భం 2022లోనే జరిగింది. ఆ సమయంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానికి ఆమెను తీసుకెళ్లడం ద్వారా ఆమెను ‘ప్రియమైన కుమార్తె’గా ప్రకటించారు. ఆ తరువాత 2023లో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్యాంగ్యాంగ్ నగరంలో నిర్వహించిన ఆయుధ ప్రదర్శనలోనూ ఆమె పాల్గొనడం గమనార్హం. అప్పటి నుంచి వరుసగా జరిగే అధికారిక కార్యక్రమాలలో ఆమె కనిపించడం విశేషం. ఈ తరచూ ప్రత్యక్షత వెనుక ఒక వ్యూహాత్మక ఉద్దేశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమ నాయకత్వ బాధ్యతలను భవిష్యత్తులో ఎవరికీ అప్పగించాలనుకుంటున్నారో ముందుగానే ప్రజలకు పరిచయం చేయడమే ఈ విధంగా కుమార్తెను ముందుంచటానికి కారణమని వారు అంచనా వేస్తున్నారు. పైగా, ఉత్తర కొరియా మీడియా కూడా ఆమెను “గౌరవనీయమైన కుమార్తె”గా పేర్కొనడం గమనార్హం. సాధారణంగా ఈ పదాన్ని కేవలం అత్యున్నత స్థాయి నేతలకే వర్తింపజేస్తారు.
కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ మరణానంతరం 2011లో అధికారం చేపట్టిన విధానాన్నే ఇప్పుడు కిమ్-జు-యేకు వర్తింపజేయాలన్న ఉద్దేశంతోనే క్రమంగా ఆమెను నాయకత్వ వేదికలపై చూపిస్తున్నారు అనే వాదన బలపడుతోంది. అయితే ఆమె వయస్సు ప్రస్తుతం 13 ఏళ్లు మాత్రమే కావడం వల్ల, అధికార బాధ్యతలు చేపట్టే వరకు కొంతకాలం పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక, దక్షిణ కొరియా నిఘా వర్గాల ప్రకారం, కిమ్‌కు మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో మొదటి సంతానం కుమారుడు కాగా, రెండవది కిమ్-జు-యే. ఈమధ్యకాలంలో ఆమెకే అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుండటంతో, కిమ్ అనంతరం పాలనా పగ్గాలు చేపట్టే అవకాశాలు కిమ్-జు-యేకే ఎక్కువగా ఉన్నాయని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక, ఇవన్నీ చూస్తే, కిమ్ కుటుంబ పాలన తరతరాలుగా కొనసాగనుందని స్పష్టంగా అనిపిస్తోంది. ప్రపంచ రాజకీయం మారుతున్నా, ఉత్తర కొరియాలో మాత్రం వంశపారంపర్య పాలనకి మొగ్గు తగ్గే సూచనలు కనిపించట్లేదు.