Kamala Harris : కమల హవా.. మూడు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్‌పై ఆధిక్యం
కమలా హ్యారిస్.. ఇప్పుడు అమెరికాలో ఓ ప్రభంజనం. మన భారత సంతతి బిడ్డ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.
- By Pasha Published Date - 09:32 AM, Mon - 12 August 24

Kamala Harris : కమలా హ్యారిస్.. ఇప్పుడు అమెరికాలో ఓ ప్రభంజనం. మన భారత సంతతి బిడ్డ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ప్రచార దూకుడుకు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ విలవిలలాడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో కమలకు బలమైన మద్దతు లభిస్తోంది. దీంతో ట్రంప్ వెనుకంజలో ఉండిపోయారు. దీన్ని రాజకీయ పరిశీలకులు కమలకు శుభ శకునంగా చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అమెరికాలో ఎన్నికలకు ముందు హాట్ టాపిక్ అంటే సర్వేలే. ఈ సర్వే నివేదికలను బట్టి అమెరికాలోని ఏయే రాష్ట్రాల ప్రజల మూడ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ సంయుక్తంగా విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిచిగాన్ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా సంచలన ఫలితం వచ్చింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ట్రంప్ కంటే కమలా హ్యారిస్(Kamala Harris) 4 శాతం ఎక్కువ ఓట్లను సాధించారు. ఈ మూడు రాష్ట్రాల్లో ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహించిన సర్వేలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌నకు 46 శాతం మంది, కమలా హ్యారిస్‌కు 50 శాతం మంది మద్దతు ఉందని వెల్లడైంది. ట్రంప్‌పై మిచిగాన్‌లో 4.8 శాతం, పెన్సిల్వేనియాలో 4.2 శాతం, విస్కాన్సిస్‌లో 4.3 శాతం ఓట్ల ఆధిక్యాన్ని కమలా హ్యారిస్ సాధించి ముందంజలో నిలిచారు. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిచిగాన్ రాష్ట్రాలకు స్వింగ్ స్టేట్స్ అనే పేరు ఉంది. అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు కీలకంగా ఉంటాయి. ఇవి ఎటువైపు నిలిస్తే అటువైపు ఫలితం మళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిపై అమెరికా రాజకీయ పార్టీల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.
Also Read :Band Aid For Heart : గుండెకు బ్యాండ్ ఎయిడ్.. రెడీ చేసిన శాస్త్రవేత్తలు
ఎన్నికల బరి నుంచి జో బైడెన్ వైదొలగకముందు విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిచిగాన్ రాష్ట్రాల్లో జరిగిన సర్వేలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. కమల రంగంలోకి దిగాక మొత్తం సీన్ మారిపోయింది. ఈ ఏడాది మే నుంచి ఈ మూడు రాష్ట్రాల్లోని ఓటర్లు క్రమంగా డెమొక్రటిక్ పార్టీకి చేరువ అవుతున్నారు.డెమొక్రటిక్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆగస్టు 19న జరగనుంది. ఆ భేటీలోనే పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరును ప్రకటించనున్నారు. నవంబరు 5న అమెరికా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో భాగంగా సెప్టెంబరు 10 కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య డిబేట్ జరగనుంది.