ట్రంప్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళన!
జెడి వాన్స్ మొదటి నుంచీ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. దీనివల్ల నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
- Author : Gopi
Date : 29-04-2026 - 1:01 IST
Published By : Hashtagu Telugu Desk
JD Vance: అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ట్రంప్ పరిపాలనలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం.. యుద్ధానికి సంబంధించిన క్షేత్రస్థాయి వాస్తవాల గురించి పెంటగాన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం లేదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ అనుమానిస్తున్నారు.
వాస్తవాలను పెంటగాన్ దాచిపెడుతోందా?
రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ గత ఎనిమిది వారాలుగా సాగుతున్న ఈ పోరాటంలో అమెరికన్ దళాల పనితీరును ప్రశంసిస్తున్నారు. ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, రక్షణ మౌలిక సదుపాయాలను తాము ధ్వంసం చేశామని, అమెరికా వద్ద ఆయుధ నిల్వలు ఇంకా పుష్కలంగా ఉన్నాయని వారు నొక్కి చెబుతున్నారు. అయితే ‘ది అట్లాంటిక్’ నివేదిక ప్రకారం.. మూసివేసిన తలుపుల వెనుక జరిగిన సమావేశాలలో జెడి వాన్స్ ఈ వాదనలపై పదేపదే ప్రశ్నలు లేవనెత్తారు.
Also Read: పర్మినెంట్ టాటూ వేయించుకుంటున్నారా?
ట్రంప్‌కు యుద్ధం గురించి తప్పుడు సమాచారం అందుతోందా?
నివేదిక ప్రకారం.. ట్రంప్ ముందు ఉంచుతున్న యుద్ధ చిత్రం వాస్తవానికి దూరంగా ఉండవచ్చని వాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా క్షిపణి నిల్వలు భారీగా తగ్గిపోవడంపై ఆయన ఆందోళన చెందుతున్నారు. పరిపాలనలోని సీనియర్ అధికారుల కథనం ప్రకారం.. క్షిపణి వ్యవస్థల లభ్యతపై వాన్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధంలో వీటిని ఇలాగే వాడుతూ పోతే, భవిష్యత్తులో చైనా, ఉత్తర కొరియా లేదా రష్యాతో సంభవించే పోరాటాల్లో అమెరికా వద్ద తగినన్ని వనరులు మిగలవని ఆయన అభిప్రాయపడుతున్నారు.
జెడి వాన్స్ మొదటి నుంచీ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. దీనివల్ల నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన మొదటి విడత శాంతి చర్చలకు వాన్సే నాయకత్వం వహించారు. కానీ అవి విఫలమయ్యాయి. ఈ వారంలో జరగాల్సిన రెండో విడత చర్చలు కూడా రద్దయ్యాయి. గమనార్హం ఏంటంటే.. జెడి వాన్స్ బహిరంగంగా హెగ్సెత్ను ప్రశంసిస్తున్నప్పటికీ ప్రైవేట్ సమావేశాలలో మాత్రం వ్యూహాత్మక ప్రణాళికలోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఏమి వినాలనుకుంటున్నారో హెగ్సెత్ అవే చెబుతున్నారని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
