Hunter Biden Guilty : ఆ కేసులో బైడెన్ కుమారుడు దోషి.. అమెరికా ప్రెసిడెంట్ కీలక ప్రకటన
దేశ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌కు బిగ్ షాక్ తగిలింది.
- By Pasha Published Date - 09:13 AM, Wed - 12 June 24

Hunter Biden Guilty : దేశ అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు హంటర్ బైడెన్ ఓ కేసులో దోషిగా తేలాడు. తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో హంటర్ బైడెన్ దోషి అని డెలావెర్‌లోని విల్మింగ్టన్ కోర్టు నిర్ధారించింది. హంటర్ బైడెన్‌పై మోపిన 3 అభియోగాల్లోనూ నేర నిర్ధారణ జరిగిందని న్యాయస్థానం ప్రకటించింది. అయితే హంటర్‌కు ఎంత శిక్ష విధిస్తారనే దానిపై ఇంకా ప్రకటన వెలువడలేదు. సాధారణంగానైతే ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలే వారికి 25ఏళ్ల దాకా జైలు శిక్ష వేస్తుంటారు. అయితే హంటర్ బైడెన్(Hunter Biden Guilty) తొలిసారి ఈ తరహా నేరం చేసినందున అంత భారీ శిక్ష పడకపోవచ్చని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
తల్లి, భార్యతో కలిసి కోర్టుకు హంటర్
ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడిన తర్వాత.. కోర్టులోనే ఉన్న హంటర్ బైడెన్ ఎమోషనల్ అయ్యారు. అక్కడే ఉన్న తన న్యాయవాదితో పాటు సతీమణి మెలిస్సా, తల్లి జిల్ బైడెన్‌ను భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. అనంతరం తన భార్య, తల్లితో కలిసి హంటర్ బైడెన్ కోర్టు నుంచి వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు ఈ తీర్పుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా స్పందించారు. కోర్టు తీర్పును అంగీకరిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ కేసులో తన కుమారుడి తరఫున క్షమాభిక్షను కోరబోనని జో బైడెన్ ప్రకటించారు.
Also Read : Terrorists Attack : కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి.. ఆర్మీ బేస్‌పై కాల్పులు.. ఒకరు మృతి
2018 సంవత్సరంలో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలరుకు ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్ బైడెన్ తప్పుడు సమాచారాన్ని అందించారు. తాను అక్రమంగా డ్రగ్స్ ఎక్కడా కొనలేదని.. వాటిని వినియోగించలేదని.. తనవద్ద అక్రమంగా ఆయుధాలు లేవని పేర్కొంటూ ఆయుధ డీలరుకు ఓ ప్రమాణ పత్రాన్ని హంటర్ అందించారు. దర్యాప్తు చేయగా .. ఆ వివరాలన్నీ తప్పు అని వెల్లడైంది. అప్పటికే హంటర్ బైడెన్ డ్రగ్స్ అక్రమంగా కొని వాడేవారని విచారణలో తేలింది. ఆయన 11 రోజులపాటు అక్రమంగా ఆయుధాలు కూడా వాడారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతోపాటు హంటర్ బైడెన్‌పై మరో కేసు కూడా ఉంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో రూ.11 కోట్ల పన్ను ఎగవేత కేసులోనూ ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. ఆ కేసు కాలిఫోర్నియా కోర్టులో ఈ ఏడాది సెప్టెంబరులో విచారణకు రానుంది.