Nithyananda : బొలీవియాలోని 4.80 లక్షల ఎకరాల్లో నిత్యానంద కలకలం
2010 సంవత్సరంలో నిత్యానందకు(Nithyananda) సంబంధించిన ఒక అశ్లీల సీడీ బయటకు వచ్చింది.
- By Pasha Published Date - 05:54 PM, Wed - 26 March 25

Nithyananda : మన భారతదేశంలో ఉండగా రెచ్చిపోయి ఎంతోమందిని, ఎన్నో రకాలుగా మోసం చేసిన నిత్యానంద ఇంకా రెచ్చిపోతున్నాడు. విదేశాల్లోనూ తన చీటింగ్ దందాను కొనసాగిస్తున్నాడు. దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశంలోని పెద్ద భూభాగంపై అతడు కన్నేశాడు. కైలాస పేరుతో తన కోసం ప్రత్యేక దేశాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని స్కెచ్ గీశాడు. నిత్యానందకు చెందిన దాదాపు 20 మంది శిష్యులు బొలీవియాలో రంగంలోకి దిగారు. అక్కడి గిరిజనులతో చర్చలు జరిపి, మోసపూరితంగా 4 లక్షల 80 వేల ఎకరాల భూమిని కొన్నారు. ఈ భూమిని ఏకంగా 1000 సంవత్సరాల కోసం లీజుకు రాయించుకున్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను తయారు చేయించారు. లీజుకు తీసుకున్న భూమికి సంవత్సరానికి రూ. 8.96 లక్షలు చొప్పున ఇస్తామని డాక్యుమెంట్లలో ప్రస్తావించారు. అంటే నెలకు రూ. 74,667, రోజుకు రూ. 2,455 చొప్పున చెల్లించేలా అగ్రిమెంట్ కుదిరింది.
Also Read :AI Image Creator: అదుర్స్.. ఛాట్ జీపీటీలో అత్యాధునిక ‘ఇమేజ్ జనరేషన్ ఫీచర్’
కైలాస దేశం ఏర్పాటుకు ప్లాన్
త్వరలో ఆ స్థలంలో కైలాస దేశం ఏర్పాటుపై ప్రకటన చేయాలని నిత్యానంద మనుషులు భావించారు. అయితే ఇంతలోనే విషయమంతా మీడియాకు లీక్ అయింది. దీనిపై భారత సర్కారు, బొలీవియా ప్రభుత్వం అలర్ట్ అయ్యాయి. నిత్యానందకు చెందిన 20 మంది శిష్యులను మార్చి 25నే తమ దేశం నుంచి బయటికి సాగనంపింది. గిరిజనులతో నిత్యానంద శిష్యులు చేసుకున్న భూమి లీజు ఒప్పందం చెల్లదని, అది తమ చట్టాలకు విరుద్ధమని బొలీవియా ప్రభుత్వం వెల్లడించింది.
2019 నుంచి పరారీలో..
2010 సంవత్సరంలో నిత్యానందకు(Nithyananda) సంబంధించిన ఒక అశ్లీల సీడీ బయటకు వచ్చింది. దాని కారణంగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఓ కేసులో నిత్యానందపై కర్ణాటక సెషన్స్ కోర్టు 2010లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2012లో నిత్యానందపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి. 2019లో ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసి బందీగా ఉంచినందుకు నిత్యానందపై కేసు నమోదైంది. కేసులు నెత్తిపై పడటంతో తాళలేక నిత్యానంద 2019లో భారతదేశం నుంచి పరారయ్యాడు.