Iran Vs US : ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి.. బైడెన్, ట్రంప్ కీలక వ్యాఖ్యలు
యుద్ధాలను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తాను సాధ్యమైనంత ఎక్కువ సాయాన్నే అందించానని బైడెన్ (Iran Vs US) చెప్పుకొచ్చారు.
- By Pasha Published Date - 09:49 AM, Sat - 5 October 24

Iran Vs US : ఇటీవలే తమపై దాడి చేసిన ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ రెడీ అవుతోంది. ఈ తరుణంలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ అధ్యక్షుడు (రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి) డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇరాన్‌లోని ఆయిల్ రిఫైనరీలు, అణ్వాయుధ తయారీ కేంద్రాలపై దాడి చేస్తే సమస్య తలెత్తుతుంది. వాటిని మినహాయించి ఇతర లక్ష్యాలపై దాడి చేసే అంశాన్ని ఇజ్రాయెల్ పరిశీలించాలి. ఒకవేళ నేను ఇజ్రాయెల్ స్థానంలో ఉంటే అలాగే ఆలోచించే వాడిని’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తలిపారు. ‘‘ఇరాన్‌పై ఎలా దాడి చేయాలి? ఇరాన్‌లోని ఏయే టార్గెట్లపై దాడి చేయాలి ? అనే దానిపై ఇజ్రాయెల్ ఇంకా ఒక అంచనాకు రాలేదు’’ అని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు. యుద్ధాలను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌కు తాను సాధ్యమైనంత ఎక్కువ సాయాన్నే అందించానని బైడెన్ (Iran Vs US) చెప్పుకొచ్చారు. అమెరికా వైట్ హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అనుకోవడం లేదు
నవంబరు 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ‘‘వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని నేను అనుకోవడం లేదు. గత ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా ఫలితాలు రాలేదు. దీంతో ఆయన అప్పట్లో ఎలాంటి ప్రమాదకర వ్యాఖ్యలు చేశారో అందరికీ గుర్తుంది’’ అని బైడెన్ పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగానే జరుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read :Haryana Elections 2024 : హర్యానాలో ఓట్ల పండుగ.. ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం
ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేయాల్సిందే : ట్రంప్
బైడెన్ వ్యాఖ్యలను మాజీ అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్‌కు ఆయన సూచించారు. ‘‘ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేస్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడే ఆలోచించొద్దు.. ఆ విషయం గురించి దాడి చేశాక ఆలోచించుకోవచ్చు. ముందుగా ఇరాన్‌కు ఇజ్రాయెల్ బలమైన జవాబివ్వాలి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోని ఫయెట్‌విల్లేలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.