Hezbollah Attack : నలుగురు ఇజ్రాయెలీ సైనికులు మృతి.. 58 మందికి గాయాలు.. సూసైడ్ డ్రోన్లతో హిజ్బుల్లా దాడి
లెబనాన్ దేశంలోని కొంత భూభాగాన్ని ఇప్పటికే ఇజ్రాయెలీ ఆర్మీ (Hezbollah Attack) ఆక్రమించుకుంది.
- By Pasha Published Date - 12:17 PM, Mon - 14 October 24

Hezbollah Attack : ఇజ్రాయెల్‌కు హిజ్బుల్లా షాక్ ఇచ్చింది. రెండు ‘మీర్ సాద్’ సూసైడ్ డ్రోన్లతో ఇజ్రాయెల్‌లోని ఒక రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌పై దాడికి తెగబడింది. ఈ ఘటనలో నలుగురు ఇజ్రాయెలీ సైనికులు చనిపోగా.. దాదాపు 58 మంది సైనికులకు గాయాలయ్యాయి. దాదాపు 120 కి.మీ దూరం నుంచి ఈ సూసైడ్ డ్రోన్లను హిజ్బుల్లా మిలిటెంట్లు ప్రయోగించారు. ఈక్రమంలో అవి గంటకు 370 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ తమ లక్ష్యాన్ని (రీసెర్ఛ్ సెంటర్) చేరుకొని పేలిపోయాయి. దాడి జరిగిన టైంలో ఈ సెంటర్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన గోలానీ బ్రిగేడ్ సైనికులు దాదాపు 100 మంది భోజనం చేస్తున్నారని సమాచారం. ఒక్కో డ్రోన్ దాదాపు 40 కేజీల పేలుడు పదార్థాలను మోసుకొచ్చినట్లు గుర్తించారు. ఈ రెండు డ్రోన్లు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌పై పడి పేలిపోగానే.. పెద్దఎత్తున పరిసరాల్లో పొగలు కమ్ముకున్నాయి. మంటలు చెలరేగాయి. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. పెద్దఎత్తున గాయపడిన సైనికులను అందరినీ వెంటనే అంబులెన్సులలో సమీపంలోని ఆస్పత్రులలో చేర్పించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read :YouTube Skip Ad : యూట్యూబ్ ‘స్కిప్ యాడ్’ బటన్ తీసేశారా ? అసలు ఏమైంది ?
‘మీర్ సాద్’ డ్రోన్లు ఇరాన్ తయారు చేసినవే. వాటిని హిజ్బుల్లా మిలిటెంట్లకు సప్లై చేసింది. ఈ డ్రోన్లను ఇరాన్‌లో అబాబీల్-టి అని పిలుస్తారు. ఇది హిజ్బుల్లా వినియోగిస్తున్న ప్రధాన సూసైడ్ డ్రోన్. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం అయ్యాయి. లెబనాన్ దేశంలోని కొంత భూభాగాన్ని ఇప్పటికే ఇజ్రాయెలీ ఆర్మీ (Hezbollah Attack) ఆక్రమించుకుంది. లెబనాన్‌లోని చాలా నగరాల ప్రజలను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెలీ ఆర్మీ ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు తమ సైనిక శక్తిని తెలియజేసేందుకే హిజ్బుల్లా ఈ సూసైడ్ డ్రోన్‌తో దాడి చేసిందని భావిస్తున్నారు. ‘మీర్ సాద్’ డ్రోన్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి 3000 మీటర్ల ఎత్తు నుంచి ఎగురుతూ తమ లక్ష్యం దిశగా వెళ్లగలవు. అందువల్ల వాటిని గుర్తించి, దాడి చేయడం అనేది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు చాలా కష్టతరం అవుతుంది. అందువల్లే ఇజ్రాయెలీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు రెండు మీర్ సాద్ డ్రోన్లను గుర్తించడంలో ఫెయిల్ అయ్యాయి.