Sri Lanka : శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే అరెస్టు
2023 సెప్టెంబర్‌లో రణిల్ విక్రమసింఘే తన భార్యతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైందని ఆయన వెల్లడించినా, ఆ ప్రయాణానికి సంబంధించిన ఖర్చులను ప్రభుత్వ నిధుల ద్వారా చెల్లించారని ఆరోపణలు వచ్చాయి.
- By Latha Suma Published Date - 05:57 PM, Fri - 22 August 25

Sri Lanka : శ్రీలంక రాజకీయాల్లో శుక్రవారం కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ అధ్యక్షుడు, ఆరుసార్లు ప్రధానిగా సేవలందించిన రణిల్ విక్రమసింఘేను శ్రీలంక నేర విచారణ శాఖ (CID) అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనపై అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.
వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వ ఖర్చులు?
వివరాల్లోకి వెళితే, 2023 సెప్టెంబర్‌లో రణిల్ విక్రమసింఘే తన భార్యతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైందని ఆయన వెల్లడించినా, ఆ ప్రయాణానికి సంబంధించిన ఖర్చులను ప్రభుత్వ నిధుల ద్వారా చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. లండన్‌లో జరిగిన ఓ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ వేడుకలో ఆయన భార్యతో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ ప్రయాణాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం, అయినప్పటికీ ప్రభుత్వ సొమ్మును వినియోగించడం వివాదాస్పదంగా మారింది.
విక్రమసింఘే వాదన
ఈ ఆరోపణలపై విక్రమసింఘే స్పందిస్తూ..లండన్ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం. హవానాలో జీ-77 సమావేశానికి హాజరై తిరిగి వస్తూ లండన్ వెళ్లాను. నా భార్య ఖర్చులను ఆమె స్వయంగా భరించింది. ప్రభుత్వం నుంచి నన్ను మాత్రమే అనుసరించిన అధికారిక బృందానికి ఖర్చులు చెల్లించారు అని తెలిపారు. కానీ, విచారణ అధికారులు మాత్రం తాము సేకరించిన ఆధారాల ప్రకారం ప్రభుత్వ నిధులను ప్రయాణానికి వాడినట్టు, రక్షణ సిబ్బంది ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో CID అధికారులు శుక్రవారం ఉదయం ఆయనను విచారించగా, అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
మేజిస్ట్రేట్ ముందు హాజరు
రాజధాని కొలంబోలోని ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టుకు విక్రమసింఘేను శనివారం హాజరుపరచనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను పోలీసు కస్టడీలో ఉంచినట్టు సమాచారం. ఈ అరెస్ట్‌తో శ్రీలంకలో రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.
రెండు సంవత్సరాల క్రితమే అధ్యక్షుడు అయిన విక్రమసింఘే
2022 జూలైలో శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న సమయంలో, దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. ఆ ప్రజా ఉద్యమాల ప్రభావంతో అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయగా, అనంతరం పార్లమెంటు ఓటింగ్ ద్వారా విక్రమసింఘే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన సంస్కరణలు చేపట్టినా, అవినీతిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశం
ఇప్పుడు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మాజీ అధ్యక్షుడి అరెస్ట్ అంటే అది న్యాయ వ్యవస్థకు గౌరవమని కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఇది రాజకీయ ప్రత్యర్థుల కుతంత్రమని మండిపడుతున్నారు. శ్రీలంకలో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఈ అరెస్ట్ రాజకీయ పరినామాలకు దారి తీయనుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల దృష్ట్యా ఈ కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also: DK Shivakumar : ఆర్ఎస్ఎస్ గీతం పాడటంపై స్పష్టతనిచ్చిన డీకే శివకుమార్