ఒమిక్రాన్ BF.7 వేరియంట్ లక్షణాలివే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ప్రపంచమంతా ఉలిక్కిపడేలా చేసిన మహమ్మారి కరోనా తన పంజాను ఇంకా విసురుతూనే ఉంది.
- By Anshu Published Date - 09:23 PM, Wed - 21 December 22

ప్రపంచమంతా ఉలిక్కిపడేలా చేసిన మహమ్మారి కరోనా తన పంజాను ఇంకా విసురుతూనే ఉంది. చైనా ఇప్పటికే ఈ వైరస్ కోరల్లో చిక్కుకునే ఉంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన BF.7 చైనాలో వేగంగా విస్తరిస్తోంది. చైనాలో ఈ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పుడు మళ్లీ ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇది అన్ని వేరియంట్ల కన్నా చాలా వేగంగా విస్తరిస్తోందని పరిశోధకులు తెలిపారు.
2020వ సంవత్సరంలో ప్రపంచాన్ని కమ్మేసిన కోవిడ్ తరువాత అనేక రకాలుగా పరివర్తన చెందుతూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ వస్తోంది. అన్ని వేరియంట్లలో ఒమిక్రాన్ ఎక్కువ కాలం పాటూ తన పంజాను విస్తరిస్తోంది. ఇప్పుడు చైనా నుంచి BF.7 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. ఇండియాలో మూడు కేసులు నమోదయ్యాయి.
ఈ BF.7 వేరియంట్ టీకా వేసుకున్న వారిని కూడా వదలడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. చైనాలో వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి కూడా ఇది వ్యాపించింది. పరిశోధనల ప్రకారంగా చూస్తే BF.7 వేరియంట్ ఎక్కువగా ఊపిరితిత్తుల్లో ఎగువ శ్వాసకోశాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోందని, అది ప్రాణాంతకంగా మారుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఒమిక్రాన్ BF.7 వేరియంట్ లక్షణాలు ఒకసారి చూసినట్లైతే అన్ని వేరియంట్లలాగే దీని లక్షణాలు కూడా సాధారణంగానే ఉన్నాయి.
1. జ్వరం
2. దగ్గు
3. గొంతుమంట
4. ముక్కు కారడం
5. విపరీతమైన అలసట
6. కొందరిలో వాంతులు, విరేచనాలు
7. పొట్టలో ఇబ్బందిగా అనిపించడం
వంటివి దీని ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి. ఈ లక్షణాలు మీలో ఉంటే అలర్ట్ అవ్వండి. దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ BF.7 వేవ్ రూపంలో వస్తే దీన్ని తట్టుకోవడం కష్టం అని, దీని వల్ల చాలా మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండటం మంచిది.