Israel Vs Gaza : దక్షిణ గాజా నుంచి వెళ్లిపోండి.. పాలస్తీనీయులకు ఇజ్రాయెల్ ఆర్డర్
పాలస్తీనాలోని గాజా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.
- By Pasha Published Date - 08:56 AM, Tue - 23 July 24

Israel Vs Gaza : పాలస్తీనాలోని గాజా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ పరిధిలో ఉన్న అల్-మవాసి ఏరియా ప్రజలు ఇళ్లు విడిచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ తాజాగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రజలు అక్కడి నుంచి మళ్లీ ఉత్తర గాజా ప్రాంతం వైపుగా వలస వెళ్తున్నారు. వాస్తవానికి ఆరు నెలల క్రితమే ఉత్తర గాజాను ఇజ్రాయెల్ ఖాళీ చేయించింది. అక్కడి నుంచి లక్షలాది మంది ప్రజలు వచ్చి దక్షిణ గాజాలోని అల్-మవాసి ఏరియాలో షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆర్డర్ ఇవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా తమ కుటుంబీకుల భద్రత కోసం అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉత్తర గాజాకు వలస వెళ్తున్నారు. ‘‘మా దేశంలోనే మేం కుటుంబంతో సహా అటూఇటూ వలస వెళ్లాల్సి రావడం ఇది 15వ సారి. ఇజ్రాయెల్ అరాచకం వల్ల మేం గత 10 నెలలుగా ఇదే విధంగా బాధపడుతున్నాం’’ అని ఖాన్ యూనిస్ ప్రాంతానికి చెందిన ఓ సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తిరిగితిరిగి తాము అలసిపోయాం.. విసిగిపోయామని వ్యాఖ్యానించాడు.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు దక్షిణ గాజాపై ఇజ్రాయెల్(Israel Vs Gaza) దాడుల తీవ్రతను పెంచింది. పెద్దఎత్తున యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలతో దాడులను నిర్వహిస్తోంది. హమాస్ కీలక కమాండర్లు దక్షిణ గాజాలోనే(South Gaza) నక్కి ఉన్నారని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఈ కమాండర్లు ఎక్కడ ఉన్నారు ? అనే దానిపై మాత్రం స్పష్టమైన సమాచారాన్ని ఇజ్రాయెల్ చెప్పలేకపోతోంది. హమాస్ లీడర్లు ఉన్నారనే కారణంతో ఇటీవలే ఖాన్ యూనిస్ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో వందలాది మంది చనిపోయారు.ఖాన్ యూనిస్ ప్రాంతంలో 30కిపైగా హమాస్ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని ఇజ్రాయెల్ అంటోంది. హమాస్ మిలిటెంట్లు ఉపయోగించే ఆయుధాల నిల్వ కేంద్రం, పరిశీలన పోస్టులు, టన్నెల్ షాఫ్ట్‌లు, నిర్మాణాలపై దాడులు చేస్తామని చెబుతోంది.
Also Read :Godavari : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. కాసేపట్లో మూడో వార్నింగ్
గత శుక్రవారం రోజు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై యెమన్‌కు చెందిన హౌతీలు డ్రోన్ దాడి చేశారు. ఈ దాడిలో ఒక ఇజ్రాయెలీ చనిపోగా, దాదాపు 10 మందికి గాయాలయ్యాయి. దీంతో శనివారం రోజు యెమెన్‌లోని హూతీల స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హొదైదా నౌకాశ్రయంతోపాటు పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, 80 మందికి గాయాలయ్యాయి.