Barron Trump : పొలిటికల్ ఎంట్రీపై ట్రంప్ చిన్న కొడుకు యూటర్న్.. ఎందుకు ?
Barron Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారన్ ట్రంప్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఇటీవల తీవ్ర ప్రచారం జరిగింది.
- By Pasha Published Date - 09:17 AM, Sat - 11 May 24

Barron Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారన్ ట్రంప్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఇటీవల తీవ్ర ప్రచారం జరిగింది. ఈ ఏడాది నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీపడుతున్న నేపథ్యంలో.. ఆయన కుమారుడు బారన్ ట్రంప్‌ను ఫ్లోరిడా రాష్ట్ర ప్రతినిధిగా రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌కు పంపుతారనే టాక్ నడిచింది. జులైలో జరిగే రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌కు బారన్ ట్రంప్‌ను ఫ్లోరిడా ప్రతినిధిగా పంపుతామని ఆ రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ ఛైర్మన్ ఇవాన్ పవర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కారణాలేమిటో తెలియదు కానీ.. ఇప్పుడు పరిణామాలు మారాయి. బారన్ ట్రంప్(Barron Trump) యూటర్న్ తీసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. దీనిపై బారన్ తల్లి మెలానియా ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఫ్లోరిడా రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రతినిధిగా బారన్ ట్రంప్‌ను ఎంపిక చేయడం గొప్ప విషయం. అయితే ముందుగా నిర్ణయించబడిన కొన్ని పనుల కారణంగా మిల్వాకీ నగరంలో జరిగే ఆ ప్రతిష్ఠాత్మక సమావేశంలో బారన్ ట్రంప్ పాల్గొనలేరు’’ అని మెలానియా ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇది బారన్ ట్రంప్ నిర్ణయమా ? కుటుంబం నిర్ణయమా ? అనేది తెలియరాలేదు.
We’re now on WhatsApp. Click to Join
ఏమిటీ రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ ?
నవంబరు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఇప్పటికే ట్రంప్ పేరు ఖరారైంది. దీనికి అధికారిక ముద్ర అనేది జులై నెల 15 నుంచి 18 వరకు విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో జరిగే రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ వేదికగా పడనుంది. ఈ సమావేశంలో అమెరికాలోని ప్రతీ రాష్ట్రం నుంచి ఒక్కో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు హాజరై అధ్యక్ష అభ్యర్థికి తమ మద్దతును ప్రకటిస్తారు. ఈక్రమంలోనే ఫ్లోరిడా రాష్ట్రం నుంచి రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిగా బారన్ ట్రంప్‌ను పంపుదామని భావించారు.
Also Read :Telangana Ministers : తెలంగాణ మంత్రులకు ‘లోక్‌సభ’ పరీక్ష.. ఎందుకంటే ?
ఫ్లోరిడా రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి బృందంలో ఇప్పటికే బారన్ ట్రంప్ తోబుట్టువులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, టిఫనీ ట్రంప్ ఉన్నారు. ఇక ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జేర్డ్ కుష్నర్ గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో సీనియర్ సలహాదారుగా పనిచేశారు. ట్రంప్ ఎన్నికల ప్రచార ర్యాలీలలో డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ చాలాసార్లు పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చిలో రిపబ్లికన్ పార్టీ నేషనల్ కమిటీలోకి ఎరిక్ ట్రంప్ భార్య లారా ట్రంప్ ఎన్నికయ్యారు. బారన్ ట్రంప్‌ను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంచడంపై ఇప్పుడు అమెరికాలో సర్వత్రా చర్చ జరుగుతోంది.