World War 3 : ట్రంప్ అధ్యక్షుడు అయ్యేలోగా మూడో ప్రపంచ యుద్ధం.. బైడెన్ కుట్ర : జూనియర్ ట్రంప్
అమెరికా విదేశాంగ విధానాలను చెత్తగా మార్చిన తర్వాతే.. వైట్ హౌస్‌ను ట్రంప్‌కు అప్పగించాలనే సంకల్పంతో బైడెన్(World War 3) ఉన్నట్టుగా కనిపిస్తున్నారని జూనియర్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
- By Pasha Published Date - 04:26 PM, Mon - 18 November 24

World War 3 : మూడో ప్రపంచ యుద్ధం దిశగా ప్రపంచం పోతోందా ? రష్యాను కవ్వించేలా అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందా ? అంటే.. ఔను అనే సమాధానం ఇచ్చేలా కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చెందిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లు, డ్రోన్లను రష్యాపై వాడేందుకు ఉక్రెయిన్‌కు బైడెన్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా ప్రమాదకర నిర్ణయమని అభిప్రాయపడ్డారు. నూతన అధ్యక్షుడిగా మా నాన్న (డొనాల్డ్ ట్రంప్) వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టడానికి ముందే.. మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టేలా బైడెన్ కవ్వింపు నిర్ణయాలు తీసుకుంటున్నారని జూనియర్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ విధానాలను చెత్తగా మార్చిన తర్వాతే.. వైట్ హౌస్‌ను ట్రంప్‌కు అప్పగించాలనే సంకల్పంతో బైడెన్(World War 3) ఉన్నట్టుగా కనిపిస్తున్నారని జూనియర్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా బైడెన్ నిర్ణయాలు ఉన్నాయన్నారు.
Also Read :Phone Tapping Case : హరీష్‌రావు నా ఫోన్ ట్యాప్ చేయించారు.. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్
రష్యా డ్యూమా సభ్యురాలు బూటినా ఏమన్నారంటే..
రష్యాపైకి అమెరికా లాంగ్ రేంజ్ మిస్సైళ్లను వాడొచ్చని ఉక్రెయిన్‌కు బైడెన్ అనుమతి ఇవ్వడాన్ని రష్యా డ్యూమా సభ్యురాలు మారియా బూటినా కూడా తప్పుపట్టారు. మూడో ప్రపంచ యుద్ధం వైపుగా బైడెన్ నిర్ణయాలు ఉన్నాయని ఆమె ధ్వజమెత్తారు. బైడెన్ అమెరికాలో అధికారంలో ఉన్నన్ని నాళ్లు ఇలాంటి నిర్ణయాలే వచ్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటారని రష్యా ఆశిస్తోందని మారియా బూటినా కామెంట్ చేశారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదని ఆమె స్పష్టం చేశారు. అమెరికాలో బైడెన్ లాంటి కొందరు తాము పోగొట్టుకోవడానికి ఇంకా ఏమీ మిగలలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మారియా బూటినా ధ్వజమెత్తారు. అమెరికాలో రష్యా ఏజెంటుగా పనిచేస్తోందనే ఆరోపణలపై బూటినా దాదాపు 15 నెలలపాటు జైల్లో గడిపారు. ప్రస్తుతం ఆమె యునైటెడ్ రష్యా పార్టీ తరఫున డ్యూమా సభ్యురాలు.