Bishnoi Gang : లారెన్స్ ముఠాను వాడుకొని ఖలిస్తానీలపై దాడులు.. కెనడా ఆరోపణ
గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉంటూనే తన ముఠాను లారెన్స్ బిష్ణోయ్ ఎలా నడుపుతున్నాడు ? అనే అంశంపై భారత మీడియాలోనూ(Bishnoi Gang) ముమ్మర చర్చ జరుగుతోంది.
- By Pasha Published Date - 09:04 AM, Tue - 15 October 24

Bishnoi Gang : ప్రస్తుతం కెనడా – భారత్ మధ్య తీవ్రస్థాయిలో దౌత్య యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో కెనడాలోని ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భారత్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తమ దేశంలో ఉంటున్న ఖలిస్తాన్ అనుకూల వర్గం వారిని లక్ష్యంగా చేసుకోవడానికి భారత ఏజెంట్లు, లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించింది. ఇటీవలే ముంబైలోని జరిగిన ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులోనూ లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉంటూనే తన ముఠాను లారెన్స్ బిష్ణోయ్ ఎలా నడుపుతున్నాడు ? అనే అంశంపై భారత మీడియాలోనూ(Bishnoi Gang) ముమ్మర చర్చ జరుగుతోంది. లారెన్స్ ముఠాలో దాదాపు 700 ప్రొఫెషనల్ షూటర్లు ఉన్నారని కూడా కథనాలు వస్తున్నాయి. ఇవన్నీ సినీ వర్గాలు, రాజకీయ ప్రముఖుల్లో కలవరాన్ని క్రియేట్ చేస్తున్నాయి. దావూద్ ఇబ్రహీం భారత్ నుంచి పరారైన తర్వాత.. మళ్లీ ఇప్పుడు అదే తరహా మాఫియాను క్రియేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.
Also Read :Cloves With Lemon: లవంగాలను నిమ్మకాయతో కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా!
దౌత్య యుద్ధం ఇలా..
కెనడా విషయంలో భారత్ వాదన మరోలా ఉంది. భారత్‌లో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న ఉగ్రమూకలకు కెనడా ఆశ్రయం కల్పిస్తోందని భారత్ అంటోంది. కెనడాలో ఉంటున్న ఖలిస్తానీ వేర్పాటువాదుల వల్ల.. అక్కడున్న భారతీయులకు భద్రత లేకుండాపోయిందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఖలిస్తానీ వేర్పాటువాదుల వెనుక పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉందని భారత్ అంటోంది. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసు అనుమానితుల జాబితాలో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మను చేర్చడానికి ఇటీవలే కెనడా యత్నించింది. దీనిపై మండిపడ్డ భారత్.. సంజయ్‌కుమార్ వర్మ, మరికొందరు అధికారుల్ని కెనడా నుంచి స్వదేశానికి వచ్చేయాలని ఆదేశించింది. ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించాలని కూడా భారత్ నిర్ణయం తీసుకుంది. వారు ఈ నెల 19న రాత్రి 11.59 గంటల్లోగా భారత్‌ను వీడి వెళ్లాలని గడువు విధించింది. ప్రతిగా కెనడా సైతం ఆరుగురు భారత దౌత్యాధికారుల్ని బహిష్కరించాలని నిర్ణయించడం గమనార్హం.