Axiom-4 : జూన్ 22న చేపట్టాల్సిన యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా
యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) అధికారికంగా వెల్లడించింది.
- By Kavya Krishna Published Date - 11:25 AM, Fri - 20 June 25

Axiom-4 : యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) అధికారికంగా వెల్లడించింది. ముందుగా జూన్ 22న ఈ మిషన్‌ను చేపట్టాలని భావించినా, కొన్ని సాంకేతిక కారణాలతో మళ్లీ వాయిదా వేయక తప్పలేదు. ఈ మిషన్‌లో భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉండడం గమనార్హం. మిషన్‌ను ఎప్పటి నిర్వహిస్తారన్నదీ త్వరలోనే తెలియజేస్తామని ఐఎస్ఎస్ పేర్కొంది.
ఇటీవల జరిగిన మరమ్మతుల అనంతరం ఐఎస్ఎస్‌లోని పనితీరును నాసా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మిషన్ ఏడు సార్లు వాయిదా పడగా, విజయం సాధించేందుకు NASA, SpaceX, Axiom Space సంస్థలు గట్టి కసరత్తు చేస్తున్నాయి. మిషన్‌కు జూన్ 30 వరకూ లాంచ్ విండో ఉందని, అది మిస్ అయితే మరో 15 రోజుల తర్వాతే ప్రయోగానికి అవకాశం ఉండనుంది.
శుభాన్షు శుక్లా – భారత తరఫున రెండో వ్యోమగామి
Axiom-4 మిషన్‌లో నలుగురు అంతరిక్షయాత్రికులు పాలుపంచుకోనుండగా, భారతీయుడిగా శుభాన్షు శుక్లా ఈ మిషన్‌కు పైలట్‌గా వ్యవహరించనున్నారు. నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఈ మిషన్‌కు కమాండర్‌గా వ్యవహరించనున్నారు. మిగతా ఇద్దరు సభ్యులు పోలాండ్‌కు చెందిన స్లావోజ్, హంగేరీకి చెందిన టిబోర్ కాపూ. మే 14నుండి మిషన్ టీమ్ క్వారంటైన్‌లోనే ఉంది. ప్రయోగానికి ముందు వరకు అన్ని మెడికల్ , భద్రతా నిబంధనలను అనుసరిస్తారని ఐఎస్ఎస్ స్పష్టం చేసింది.
నాలుగు దశాబ్దాల తర్వాత భారతీయుడి అంతరిక్ష ప్రయాణం
శుభాన్షు శుక్లా, రాకేశ్ శర్మ తరువాత అంతరిక్షంలోకి వెళ్లే రెండో భారతీయుడిగా గుర్తింపు పొందనున్నారు. 1984లో రాకేశ్ శర్మ సోవియట్ యూనియన్‌తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈసారి శుభాన్షు ప్రయాణం ప్రైవేట్ భాగస్వామ్యం (నాసా – స్పేస్ ఎక్స్ – యాక్సియమ్ స్పేస్) ద్వారా జరగనుండటం విశేషం. ఈ మిషన్ వాయిదా పడినప్పటికీ, శుభాన్షు శుక్లా అరుదైన ఘనతను సాధించనున్నారని భావిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
Iran-Israel : పశ్చిమాసియాలో రణరంగం.. మొదటిసారి క్లస్టర్ బాంబులను వాడిన ఇరాన్