Thailand : థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా అనుతిన్ చార్న్‌విరకూల్
తాజా ఎన్నికలు మాజీ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర రాజ్యాంగ న్యాయస్థానంతో పదవి కోల్పోయిన నేపథ్యంలో అనివార్యంగా మారాయి. మాజీ ప్రధాని షినవత్ర ఇటీవల కంబోడియా సెనేట్ అధ్యక్షుడు హన్‌సేన్‌తో ఫోన్‌లో జరిపిన సంభాషణ తీవ్ర విమర్శలకు లోనైంది.
- By Latha Suma Published Date - 04:07 PM, Fri - 5 September 25

Thailand : థాయ్‌లాండ్ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. థాయ్‌లాండ్ పార్లమెంట్ కొత్త ప్రధానిగా అనుతిన్ చార్న్‌విరాకుల్‌ను ఎన్నుకుంది. భూమ్‌జైతై (Bhumjaithai) పార్టీకి చెందిన అనుతిన్, గతంలోనే కీలక పదవుల్లో సేవలందించిన అనుభవజ్ఞుడు. తాజా ఎన్నికలు మాజీ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర రాజ్యాంగ న్యాయస్థానంతో పదవి కోల్పోయిన నేపథ్యంలో అనివార్యంగా మారాయి. మాజీ ప్రధాని షినవత్ర ఇటీవల కంబోడియా సెనేట్ అధ్యక్షుడు హన్‌సేన్‌తో ఫోన్‌లో జరిపిన సంభాషణ తీవ్ర విమర్శలకు లోనైంది. థాయ్‌లాండ్, కంబోడియాల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న సందర్భంలో పొరుగుదేశం నాయకుడితో అంతటి చర్చలు జరపడం రాజ్యాంగ ఉల్లంఘనగా నిలిచింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన రాజ్యాంగ న్యాయస్థానం, ఆమె తీరును నైతిక ప్రమాణాలకు వ్యతిరేకంగా పరిగణించి, ప్రధానమంత్రి పదవికి అనర్హత ప్రకటించింది.
Read Also: Hyderabad : ఖైరతాబాద్ బడా గణేశ్‌కి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
ఈ తీర్పు వెలువడిన వెంటనే పార్లమెంటులో అత్యవసరంగా సమావేశం నిర్వహించగా, అనుతిన్ పేరు ముందుకు వచ్చింది. అనుతిన్ గతంలో షినవత్ర నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. ఆయన నేతృత్వంలోని భూమ్‌జైతై పార్టీ, గత కొన్ని సంవత్సరాలుగా థాయ్‌లాండ్ రాజకీయాలలో ప్రభావవంతంగా నిలుస్తోంది. అనుతిన్ ఎన్నికతో థాయ్‌లాండ్ గత రెండేళ్లలో మూడో ప్రధానిని చూడడం విశేషం. దేశ రాజకీయాలలో కొనసాగుతున్న అస్థిరత, సంకీర్ణ ప్రభుత్వాల మధ్య విభేదాలు, న్యాయవ్యవస్థ ముద్ర వేసే తీర్పులు ఇవన్నీ అల్లకల్లోల వాతావరణాన్ని సృష్టించాయి. అనుతిన్ ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకోవడం పెద్ద సవాలుగా మారింది.
అలాగే, షినవత్ర తొలగింపుపై థాయ్‌లాండ్‌లో రాజకీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె అనుచరులు న్యాయస్థాన తీర్పును రాజకీయంగా ప్రేరేపితమైందిగా అభివర్ణిస్తుండగా, ఇతర వర్గాలు నైతిక విలువలు ముఖ్యమని మద్దతు తెలిపాయి. ఇక, అనుతిన్ తన ప్రధానిగా బాధ్యతలలో తొలి ప్రకటనలో థాయ్‌లాండ్‌లో ప్రజల విశ్వాసాన్ని తిరిగి సంపాదించేందుకు కృషి చేస్తానని అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. దేశంలో ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ అవకాశాలు, విద్యా రంగంలో మార్పులు తీసుకురావడం తన ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, అనుతిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సిందే.