Viral News: భార్య కోసం ట్రైన్ నుంచి దూకిన భర్త, ఇద్దరూ మృతి
కుటుంబ కలహాల కారణంగా బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. కదులుతున్న రైలు కింద పడి చనిపోదామనుకున్న భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన భార్య కాసేపటికే మృతి చెందింది.
- By Praveen Aluthuru Published Date - 02:28 PM, Fri - 9 August 24

Viral News: బీహార్‌లోని జముయి జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంట్లో గొడవల కారణంగా ఓ మహిళ కదులుతున్న రైలు ముందు దూకి ప్రాణాలు విడిచింది. మహిళను రక్షించే ప్రయత్నంలో ఆమె భర్త కూడా రైలు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బీహార్ కియుల్-జసిదిహ్ రైల్వే సెక్షన్‌లోని తల్వా రైల్వే హాల్ట్ సమీపంలో ఈ విషాద సంఘటన జరిగింది. మృతులు 25 ఏళ్ల కృష్ణ దాస్ మరియు 20 ఏళ్ల భార్య సోనీ దేవిగా గుర్తించారు.
కృష్ణ దాస్ మరియు సోనీ దేవి మధ్య గృహ వివాదం నడుస్తోందని, అది కొన్ని రోజుల క్రితం తారా స్థాయికి చేరుకుంది. ఇటీవల సోనీ దేవి తన 6 నెలల కొడుకుతో కలిసి బంకాలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఈ వివాదం భార్యాభర్తల మధ్య విభేదాలను సృష్టించింది, సోనీ దేవి తిరిగి రావడానికి నిరాకరించింది. ఆమెను ఒప్పించేందుకు కృష్ణ దాస్ తన భార్య తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు, కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. గురువారం రాత్రి సోనీ దేవి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో తన బిడ్డతో కలిసి తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కృష్ణ దాస్ కూడా తన భార్యను అనుసరించాడు. వారిద్దరూ సియాతండ్ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ కూడా బంధువు వారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే సోనీదేవి ఎవరి మాట వినకపోవడంతో శుక్రవారం ఉదయం తెల్వా రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అదే సమయంలో హౌరా-రక్సాల్ ఎక్స్‌ప్రెస్ రైలు తెల్వా రైల్వే హాల్ట్‌కు వచ్చిన వెంటనే, సోనీ దేవి తన బిడ్డను ప్లాట్‌ఫారమ్‌పై ఉంచి కదులుతున్న రైలు ముందు దూకింది. ఈ ఘటనను చూసి అక్కడున్న వారు అప్రమత్తమై ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా, తన బిడ్డను, భార్యను కాపాడే ప్రయత్నంలో కృష్ణ దాస్ కూడా రైలు ముందు దూకాడు. ఈ ప్రమాదంలో కృష్ణదాస్ అక్కడికక్కడే మృతి చెందగా, సోనీదేవికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స కోసం ఝఝా రిఫరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె కూడా మరణించింది.
ఈ సంఘటన తర్వాత తల్వా రైల్వే హాల్ట్ వద్ద స్థానిక ప్రజలు గుమిగూడారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శంకర్ దాస్ తెలిపారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన బలియాడిహ్ గ్రామాన్ని శోకసంద్రంలో ముంచింది. అక్కడ ప్రజలు ఈ దురదృష్టకర సంఘటన గురించి చర్చించుకుంటున్నారు, ఇకపోతే తల్లి దండ్రులని కోల్పోయిన చిన్నారి పరిస్థితి హృదయ విదారకంగా మారింది.
Also Read: Alla Nani : వైసీపీకి షాక్.. ఆళ్ల నాని రాజీనామా