Highway : హైవేపై సడెన్ బ్రేక్ వేస్తున్నారా..? అయితే మీరు నేర చేసినట్లే !!
Highway : అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల వెనుక వస్తున్న వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఇలాంటి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ చట్టరీత్యా శిక్షార్హమని ఈ తీర్పుతో స్పష్టమైంది
- By Sudheer Published Date - 08:30 AM, Thu - 31 July 25

హైవేల(Highway )పై ప్రయాణించేటప్పుడు చాలామంది చేసే సాధారణ తప్పిదాలలో ఒకటి సిగ్నల్ ఇవ్వకుండా లేదా ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా సడెన్ బ్రేకులు (Sudden Brake) వేయడం. అయితే, ఇలా చేయడం కేవలం ప్రమాదాలకు దారి తీయడమే కాకుండా, చట్టరీత్యా నేరం కూడా అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన లోపం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ విషయాన్ని నిరూపిస్తూ 2013లో జరిగిన ఒక సంఘటనను సుప్రీంకోర్టు ఉదహరించింది. అప్పట్లో ఒక కారు డ్రైవర్ హైవేపై సిగ్నల్ ఇవ్వకుండా అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. వెనకాలే బైక్‌పై వస్తున్న యువకుడు కారును ఢీకొని కిందపడ్డాడు. దురదృష్టవశాత్తు, అతనిపై నుంచి బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి కాలు విరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
Tariff: 25 శాతం టారిఫ్.. భారత ప్రభుత్వం తొలి స్పందన ఇదే!
ఈ కేసును విచారించిన న్యాయస్థానం, మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి గురైన బాధితుడికి కారు డ్రైవర్, బస్సు డ్రైవర్ ఇద్దరూ కలిపి రూ. 91.39 లక్షలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు హైవేలపై వాహనం నడిపే ప్రతీ ఒక్కరికీ ఒక హెచ్చరికగా నిలుస్తుంది.
ఈ తీర్పుతో హైవేలపై వాహనదారులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వల్ల వెనుక వస్తున్న వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఇలాంటి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ చట్టరీత్యా శిక్షార్హమని ఈ తీర్పుతో స్పష్టమైంది. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఈ సంఘటన తెలియజేస్తుంది.