క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని ఎక్కువగా వాడేస్తున్నారా? అయితే మీకు IT నోటీసులు తప్పవు !!
క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిన ప్రస్తుత కాలంలో, మన ఖర్చుల విషయంలో ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) చాలా నిశితంగా నిఘా ఉంచుతోంది
- Author : Sudheer
Date : 13-01-2026 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిన ప్రస్తుత కాలంలో, మన ఖర్చుల విషయంలో ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) చాలా నిశితంగా నిఘా ఉంచుతోంది. మీ సంపాదనకు మరియు మీరు క్రెడిట్ కార్డుపై చేసే ఖర్చులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటే ఐటీ శాఖ నుండి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా, ఒక ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డు బిల్లు రూపంలో రూ. 10 లక్షలకు మించి చెల్లింపులు (నగదు లేదా ఆన్‌లైన్) చేస్తే, ఆ సమాచారం ఆటోమేటిక్‌గా ఐటీ విభాగానికి చేరుతుంది. మీ వార్షిక ఆదాయం తక్కువగా ఉండి, ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటే, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో వివరణ ఇవ్వాలని అధికారులు కోరవచ్చు.

Credit Card Using
చాలామంది రివార్డ్ పాయింట్ల కోసమో లేదా స్నేహితులకు సాయం చేయడానికో తమ కార్డును ఇతరులకు ఇస్తుంటారు. అయితే, ఫ్రెండ్స్ కోసం భారీ మొత్తంలో స్వైప్ చేయడం, రెంట్ పేమెంట్స్ యాప్స్ ద్వారా మనీ సర్క్యులేట్ చేయడం లేదా వాలెట్ లోడింగ్ వంటి లావాదేవీలను ఐటీ శాఖ అనుమానాస్పదంగా పరిగణిస్తోంది. మీరు ఇతరుల కోసం ఖర్చు చేసినప్పుడు ఆ డబ్బు మీ అకౌంట్‌కు తిరిగి వస్తే, దానిని ఆదాయంగా భావించే అవకాశం ఉంటుంది. అలాగే, బిజినెస్ లావాదేవీలను వ్యక్తిగత క్రెడిట్ కార్డులపై జరపడం కూడా నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి సందర్భాల్లో మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను పరిశీలించి, అనవసరమైన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని గుర్తిస్తే ఐటీ శాఖ గురి పెట్టడం ఖాయం.
ఒకవేళ ఐటీ శాఖ మీకు నోటీసు పంపినప్పుడు, ఆ ఖర్చులకు తగిన ఆధారాలు చూపలేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆ ఖర్చును ‘అక్రమ ఆదాయం’గా పరిగణించి, దానిపై భారీగా పన్నుతో పాటు పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, క్రెడిట్ కార్డును బాధ్యతాయుతంగా వాడటం, ప్రతి పెద్ద ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన రికార్డులను భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. అనవసరమైన క్యాష్ బ్యాక్‌లు లేదా రివార్డుల కోసం పరిమితికి మించి ఖర్చు చేసి ఆదాయపు పన్ను చిక్కుల్లో పడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.