Salman Khan -Phantom Face Pain : సల్మాన్‌ఖాన్‌ను వేధించిన ‘ఫాంటమ్ ఫేస్ పెయిన్’.. ఏమిటిది ?
Salman Khan -Phantom Face Pain : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.
- By Pasha Published Date - 10:07 AM, Sun - 29 October 23

Salman Khan -Phantom Face Pain : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఆయన వయసు 57 సంవత్సరాలు. ఇంత ఏజ్‌లోనూ సల్మాన్ చాలా ఫిట్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తుంటారు. అయితే ఆయన గతంలో ఎదుర్కొన్న ఒక ఆరోగ్య సమస్యపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. అదే.. ఫాంటమ్ ఫేస్ పెయిన్. ఈ వ్యాధిని సైంటిఫిక్ భాషలో ట్రెజిమినల్ న్యూరల్జియా లేదా ట్రైఫేషియల్ న్యూరాల్జియా అని కూడా పిలుస్తారు. ఇదొక అరుదైన వ్యాధి. 2001 సంవత్సరం నుంచి సల్మాన్‌ను ఈ వ్యాధి సతమతం చేసిందట.
ఏమిటీ ఫాంటమ్ ఫేస్ పెయిన్ ?
ఫాంటమ్ ఫేస్ పెయిన్.. ముఖంలోని నరాలకు వచ్చే వ్యాధి. మనిషి కపాలం నుంచి ముఖానికి వెళ్లే ట్రైజిమినల్ నాడి ఈ వ్యాధి వల్ల ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. ముఖం, కళ్ళు, సైనస్, నోటి నుంచి మెదడుకు అనుభూతిని, స్పర్శ, నొప్పిని తీసుకువెళ్ళే నాడి ఇది. ఈ నాడిలో ప్రాబ్లమ్ ఏర్పడటం వల్ల ముఖంలోని ఎడమవైపు లేదా కుడివైపు భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది. కరెంట్ షాక్‌ను తలపించేలా ఉండే ఈ నొప్పి ఒకసారి మొదలైతే అరగంట నుంచి గంట దాకా కంటిన్యూ అవుతుంది. నోరు, దవడ కూడా కదపలేని పరిస్థితి ఎదురవుతుంది. కొందరు రోగుల్లో ఈ నొప్పి దాదాపు మూడు గంటల దాకా ఉంటుంది. ఈ నొప్పి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుందట. ఇది వస్తే తినడం, బ్రష్ చేయడం, నీళ్లు తాగడం కూడా కష్టంగా ఉంటుందట. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందట అంటే.. దీని బారిన పడినవారు మానసికంగా కుంగిపోయి ఇక జీవితం చాలు అనుకునే స్థితి వస్తుందట. అయితే సల్మాన్ అమెరికాకు వెళ్లి ఈ వ్యాధికి సంబంధించిన సర్జరీ చేయించుకుని వచ్చారు. అది చాలా ఖరీదైన శస్త్ర చికిత్స అని తెలిసింది. సాధారణంగా పురుషుల కంటే స్త్రీలే ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతుంటారని వైద్యనిపుణులు అంటున్నారు. 50 ఏళ్లకు పైబడిన వారికే ఈ వ్యాధి రిస్క్ ఎక్కువని(Salman Khan -Phantom Face Pain) చెబుతున్నారు.
ఫాంటమ్ ఫేస్ పెయిన్ లక్షణాలు
- బ్రష్ చేసినప్పుడు ముఖం మొత్తం తీవ్రంగా నొప్పిగా అనిపించడం.
- ముఖాన్ని తాకినప్పుడు నొప్పి
- షేవింగ్ చేసేటప్పుడు లేదా ముఖానికి మేకప్ వేసేటప్పుడు నొప్పి
- తినేటప్పుడు లేదా తాగేటప్పుడు నొప్పిగా అనిపించడం
- మాట్లాడేటప్పుడు లేదా నవ్వుతున్నప్పుడు కూడా ముఖంలో నొప్పి
We’re now on WhatsApp. Click to Join.
సర్జరీ సక్సెస్ అవుతుందా ?
ఫాంటమ్ ఫేస్ పెయిన్.. రోగి యొక్క ముఖంపై వివిధ రకాల చర్మ సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ముఖంపై పుండ్లు పడే అవకాశం ఉంది. దంతాల్లో, చిగుళ్లలో కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. దీనికి సర్జరీ చేయించుకున్నా పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పలేమని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. సర్జరీలు ఫెయిల్ అయ్యేందుకు 30 శాతం ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఈ నొప్పిని తట్టుకునేందుకు చాలా శక్తివంతమైన యాంటీ బయోటిక్ మందులు వినియోగించాలి. అవి వేసుకున్నాక కడుపులో తిప్పినట్టు, కళ్ళు తిరిగినట్టు అవుతాయి. ఆహారం కూడా తినాలనిపించదు. అంత శక్తివంతమైన యాంటీ బయోటిక్స్‌ను శరీరం కూడా తట్టుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతుంది.