Padma Vibhushan : డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే..
Padma Vibhushan : ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి అయిన ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) ఛైర్మన్‌గా పనిచేస్తున్న ఆయన, వైద్య రంగంలో అందించిన విశేష సేవలకు ఈ గౌరవం దక్కింది
- Author : Sudheer
Date : 25-01-2025 - 10:44 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి(D. Nageshwar Reddy)కి కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ పద్మవిభూషణ్ (Padma Vibhushan) పురస్కారాన్ని ప్రకటించింది. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి అయిన ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) ఛైర్మన్‌గా పనిచేస్తున్న ఆయన, వైద్య రంగంలో అందించిన విశేష సేవలకు ఈ గౌరవం దక్కింది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అనేక అంతర్జాతీయ గుర్తింపులను పొందిన గొప్ప వైద్య నిపుణుడు.
Padma Vibhushan : కంగ్రాట్స్ ‘బాలా బాబాయ్’ అంటూ ఎన్టీఆర్ అభినందనలు
డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆలూరు మండలానికి చెందినవారు. కర్నూల్ మెడికల్ కాలేజీ నుంచి వైద్య విద్య పూర్తి చేసిన ఆయన, చెన్నైలో ఇంటర్నల్ మెడిసిన్, పీజీఏ చండీగఢ్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీలో డీఎం పూర్తిచేశారు. వైద్య రంగంలో ప్రాథమిక స్థాయిలో పనిచేసిన తర్వాత, హైదరాబాద్‌లోని నిమ్స్‌లో పని చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.
2002లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 2016లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. వైద్య రంగంలో నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టడంలో, రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో ఆయన కృషి ఎనలేనిది. ఎండోస్కోపీలో అనేక కొత్త విధానాలను అభివృద్ధి చేసి, ఆ రంగంలో మాస్టర్ ఎండోస్కోపిస్ట్‌గా గుర్తింపు పొందారు.
Padma Awards : పద్మభూషణ్ అందుకున్న తెలుగువారు వీరే..
2009లో అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ సంస్థ నుంచి మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డును పొందిన ఆయన, 2013లో మాస్టర్ ఆఫ్ వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన ఆయన, గ్యాస్ట్రోఎంటరాలజీ చికిత్సా విధానాల్లో అనేక విప్లవాత్మక మార్పులను తెచ్చారు.
డాక్టర్ నాగేశ్వర రెడ్డి స్థాపించిన AIG ఆసుపత్రి ప్రస్తుతం హార్వర్డ్, హాంకాంగ్ తర్వాత మూడవ స్థానంలో ఉంది. గ్యాస్ట్రోఎంటరాలజీ రంగంలో అత్యుత్తమ సేవలను అందిస్తూ, పరిశోధనల విషయంలోనూ ముందుకు సాగుతోంది. వైద్య రంగంలో గౌరవప్రదమైన పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకోవడం, భారతదేశ వైద్య రంగంలో వారి కృషికి నిదర్శనం.