భారతీయ రైల్వే కవచ్.. 160 కిలోమీటర్ల వేగంతోనూ సురక్షితం!
లోకో పైలట్ పొరపాటున సిగ్నల్‌ను గమనించకపోయినా లేదా సమయానికి బ్రేకులు వేయకపోయినా 'కవచ్' స్వయంగా రైలును నిలిపివేస్తుంది.
- Author : Gopichand
Date : 23-03-2026 - 10:17 IST
Published By : Hashtagu Telugu Desk
Kavach: భారతీయ రైల్వే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ‘కవచ్’ వ్యవస్థ ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) సిస్టమ్. రైళ్ల భద్రతను పెంచడానికి, ప్రమాదాలను నివారించడానికి దీనిని ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఇటీవల గంటకు 160 కిలోమీటర్ల వేగంతో జరిపిన పరీక్షల్లో ఈ వ్యవస్థ విజయవంతమైంది. ఒకవేళ రైలు రెడ్ సిగ్నల్‌ను దాటి వెళ్లినా లేదా ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఎదురైనా, ఈ వ్యవస్థ వెంటనే స్పందించి ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది.
‘కవచ్’ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
‘కవచ్’ అనేది అనేక ఆధునిక సాంకేతికతల కలయిక. ఇది రైలు, పట్టాలు, స్టేషన్ల మధ్య నిరంతరం డేటాను చేరవేస్తుంది. దీని పనితీరులో కీలకమైన అంశాలు ఇవే..!
సాంకేతికత: ఇందులో రేడియో కమ్యూనికేషన్, GPS, RFID (Radio Frequency Identification) ట్యాగ్‌లను ఉపయోగిస్తారు.
ట్రాకింగ్: రైల్వే పట్టాలపై RFID ట్యాగ్‌లను అమర్చుతారు. వీటిని రైలులో ఉండే సెన్సార్లు రీడ్ చేస్తాయి. దీనివల్ల రైలు ఖచ్చితమైన లొకేషన్, దిశ తెలుస్తుంది.
మానవ తప్పిదాల నివారణ: లోకో పైలట్ పొరపాటున సిగ్నల్‌ను గమనించకపోయినా లేదా సమయానికి బ్రేకులు వేయకపోయినా ‘కవచ్’ స్వయంగా రైలును నిలిపివేస్తుంది.
Also Read: Chiranjeevi : చిరంజీవి పై కుట్ర పన్నేది ఎవరు..? జనసేన నేత సంచలన వాఖ్యలు
ప్రమాదాల నియంత్రణ: ఎదురెదురుగా వచ్చే రైళ్ల ఢీకొనడం, వెనుక నుంచి వచ్చే రైళ్లు ఢీకొనడం, ఓవర్ స్పీడ్ వంటి సమస్యలను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
160 Kmph వేగంతోనూ భద్రత
భారతీయ రైల్వే ‘మిషన్ రఫ్తార్’ కింద రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచే పనిలో ఉంది. ఇంతటి వేగంతో వెళ్లే రైళ్లకు ‘కవచ్’ రక్షణ ఎంతో అవసరం. 160 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కూడా కేవలం కొన్ని సెకన్లలోనే స్పందించి రైలును సురక్షితంగా ఆపగలమని ట్రయల్స్ ద్వారా నిరూపితమైంది.
రాబోయే కాలంలో వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లపై ‘కవచ్’ సిస్టమ్‌ను అమర్చాలని రైల్వే శాఖ యోచిస్తోంది. దీనివల్ల రైలు ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది. పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం దాదాపు శూన్యం అవుతుంది. వెరసి భారతీయ రైల్వేలో వేగాన్ని, భద్రతను సమతుల్యం చేసే ‘గేమ్ ఛేంజర్’ సాంకేతికతగా ‘కవచ్’ అవతరించింది.