Thailand : థాయ్‌లాండ్ ప్రధానిపై సస్పెన్షన్ వేటు
ఆ కాల్‌లో ఆమె "అంకుల్" అని పిలుస్తూ, థాయ్‌లాండ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించినట్టు సమాచారం. ముఖ్యంగా దేశ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నారని, అంతర్గత సమస్యలు ఉద్ధృతంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నట్లు లీక్‌లో వెల్లడైంది.
- By Latha Suma Published Date - 01:37 PM, Tue - 1 July 25

Thailand : థాయ్‌లాండ్ యువ ప్రధానిగా రాజకీయ వేదికపై మెరుపులు మెరిపించిన పేటోంగ్టార్న్ షినవత్రా ప్రస్తుతం ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఓ కీలక ఫోన్‌కాల్ లీక్ కావడం వల్ల ఆమె పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. పొరుగుదేశమైన కంబోడియా నేతతో ఆమె చేసిన గోప్యమైన సంభాషణ బయటకు రావడంతో, దేశ రాజకీయాల్లో కలకలం రేగింది. కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌తో ఇటీవల పేటోంగ్టార్న్ ఫోన్‌లో మాట్లాడారు. ఆ కాల్‌లో ఆమె “అంకుల్” అని పిలుస్తూ, థాయ్‌లాండ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించినట్టు సమాచారం. ముఖ్యంగా దేశ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నారని, అంతర్గత సమస్యలు ఉద్ధృతంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నట్లు లీక్‌లో వెల్లడైంది.
Read Also: pashamylaram : పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి
ఈ సంభాషణ బయటపడటంతో, థాయ్‌లాండ్ రాజకీయాల్లో పెను ప్రభావం చూపింది. కన్జర్వేటివ్ సెనేటర్ల బృందం తక్షణమే స్పందించి, ఇది మంత్రివర్గ నియమావళిని ఉల్లంఘించడం కింద వస్తుందని ఆరోపించింది. దీనిపై దేశంలోని రాజ్యాంగ న్యాయస్థానం విచారణ చేపట్టి, తుది తీర్పు వచ్చే వరకు పేటోంగ్టార్న్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. ఇంతలో ఆమెకు తన సొంత పార్టీలోనూ మద్దతు తగ్గింది. షినవత్రా నేతృత్వంలోని సంకీర్ణం నుంచి కన్జర్వేటివ్ భూమ్‌జాయ్‌థాయ్ పార్టీ బయటకు వచ్చింది. ప్రధాని ఫోన్‌కాల్ వల్ల దేశ గౌరవం దెబ్బతిందని, ఆర్మీ పరువు మంటగలిసిందని ఆ పార్టీ ఆరోపించింది. ఫలితంగా ప్రభుత్వం మీద విశ్వాస సంక్షోభం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
గతేడాది ఆగస్టులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పేటోంగ్టార్న్ అప్పటినుంచి దేశ యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆమె పితామహుడు తక్సిన్ షినవత్రా కూడా మాజీ ప్రధాని కావడంతో, రాజకీయ వారసత్వంతో పాటు సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించారు. కేవలం 37 ఏళ్ల వయసులో ప్రధానిగా పదవి చేపట్టిన పేటోంగ్టార్న్, థాయ్‌లాండ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ప్రధానిగా ఎన్నికైన మహిళగా ఘనత సాధించారు. అయితే ఈ తాజా వివాదంతో ఆమె పైనే మొత్తం థాయ్‌లాండ్ రాజకీయ వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోతున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు థాయ్‌లాండ్-కంబోడియా మధ్య ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న సరిహద్దు సంబంధాలను మరింత కుదిపేస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. తుది తీర్పు వెలువడే వరకు పేటోంగ్టార్న్‌పై కొనసాగనున్న సస్పెన్షన్, థాయ్ రాజకీయాల్లో ఏ తలకిందుల మార్పులకు నాంది పలుకుతుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.