Lagacharla incident : లొంగిపోయిన నిందితుడు సురేశ్..14 రోజుల రిమాండ్
ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రర్ రెడ్డి సైతం.. పోలీసుల కస్టడీలోనే ఉండడం, ఇప్పుడు కీలక నిందితుడిగా ఉన్న సురేష్ లొంగిపోవడంతో కేసులో మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు.
- By Latha Suma Published Date - 05:29 PM, Tue - 19 November 24

Lagacharla incident : వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటికే జైలుకు తరలించారు. కాగా ఈ కేసులో ఏ2(A2) నిందితుడిగా ఉన్న సురేష్ ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా, దాడి జరిగిన రోజు నుంచి సురేష్ పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అనూహ్యంగా నేడు వికారాబాద్ పోలీసుల ఎదుట సురేష్ స్వయంగా లొంగిపోయాడు. సురేష్ కోసం వారం రోజులుగా గాలించారు. దీంతో పోలీసులు సురేష్ ను కోడంగల్ కోర్టులో హాజరు పరిచారు. సురేష్ కు 14 రోజుల రిమాండ్ కోర్టు విదించింది. సురేష్ ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.
కాగా, కలెక్టర్ పై కర్రలు రాళ్లతో దాడులు, ప్రభుత్వ అధికారులపై విచక్షణారహిత దాడికి తెగబడ్డ నిందితుల్లో చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే.. వారిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రర్ రెడ్డి సైతం.. పోలీసుల కస్టడీలోనే ఉండడం, ఇప్పుడు కీలక నిందితుడిగా ఉన్న సురేష్ లొంగిపోవడంతో కేసులో మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. అసలు వీరిద్దరు.. దాడి జరిగిన రోజు ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు. ఏఏ విషయాలపై తరుచూ మాట్లాడుకున్నారు. దాడికి ఏమైనా ప్లాన్ చేశారా వంటి విషయాలతో పాటు అనేక అంశాలపై విచారణ జరపనున్నారు.
ఇకపోతే.. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు సంబంధించి ఈ నెల 11వ తేదీన కొడంగల్‌లోని అక్కడి గ్రామాల్లో భూసేకరణ నిమిత్తం ఆ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అక్కడి వెళ్లారు. తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, అసలు తమకు ఫార్మా కంపెనీనే వద్దని గ్రామస్థులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే కలెక్టర్, ఇతర అధికారులపై విచక్షణారహితంగా దాడులు చేశారు. కలెక్టర్ కారుపై రాళ్లు రువ్వారు. అక్కడే ఉన్న ఇతర అధికారులపై మూకుమ్మడి దాడి చేశారు.