Tank Bund : 10న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ వేడుకలు: CS శాంతి కుమారి
Tank Bund : వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు.
- Author : Latha Suma
Date : 08-10-2024 - 5:56 IST
Published By : Hashtagu Telugu Desk
Saddula Bathukamma celebrations : ఈనెల 10 వతేదీన హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై దాదాపు పదివేల మంది మహిళలచే సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేశారు. 10వ తేదీన నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల పై నేడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
10వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగాగల అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు. ఈ సందర్బంగా, బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్ లనుండి ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్, లేజర్ షో ల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఈ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని పండగ శోభ వచ్చేలా నగరంలోని 150 ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విధ్యుత్ దీపాలతో అలంకరించినట్టు తెలిపారు.