Jammu and Kashmir : ప్రత్యేక హోదా పునరుద్ధరణ..తీర్మానాన్ని ఆమోదించిన అసెంబ్లీ
Jammu and Kashmir : అసెంబ్లీలో డిప్యూటీ సిఎం సురీందర్ చౌదరి ప్రత్యేక హోదా తీర్మానం ప్రవేశపెట్టబోయే ముందు మాట్లాడుతూ.. 'జమ్మూకాశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృతి హక్కులను పరిరక్షించే ప్రత్యేక హోదా రాజ్యాంగ హామీల ప్రాముఖ్యతను శాసనసభ పునరుద్ఘాటిస్తుంది. ప్రత్యేకహోదా తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేస్తుంది.
- By Latha Suma Published Date - 01:48 PM, Wed - 6 November 24

Special Status Resolution : జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో జరిగిన మొదటి సమావేశంలో జమ్మూకశ్మీర్ మంత్రివర్గం రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని పిలుపునిస్తూ.. తీర్మానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు (బుధవారం) జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని కోరుతూ ప్రవేశపెట్టిన చారిత్రాత్మక తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ఉపముఖ్యమంత్రి సురీందర్ చౌదరి ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానాన్ని బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. అయినప్పటికీ మెజార్టీ సభ్యులు ప్రత్యేక హోదా తీర్మానానికి ఆమోదం తెలిపారు.
కాగా, అసెంబ్లీలో డిప్యూటీ సిఎం సురీందర్ చౌదరి ప్రత్యేక హోదా తీర్మానం ప్రవేశపెట్టబోయే ముందు మాట్లాడుతూ.. ‘జమ్మూకాశ్మీర్ ప్రజల గుర్తింపు, సంస్కృతి హక్కులను పరిరక్షించే ప్రత్యేక హోదా రాజ్యాంగ హామీల ప్రాముఖ్యతను శాసనసభ పునరుద్ఘాటిస్తుంది. ప్రత్యేకహోదా తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర ప్రత్యేక హోదా, రాజ్యాంగ హామీలను పునరుద్ధరించడానికి, రాజ్యాంగ యంత్రాలను రూపొందించడానికి జమ్మూ కాశ్మీర్ ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రతినిధులతో చర్చలు ప్రారంభించాలని ఈ అసెంబ్లీ భారత ప్రభుత్వాన్ని కోరింది. పునరుద్ధరణకు సంబంధించిన ఏదైనా ప్రక్రియ జాతీయ ఐక్యతను, జమ్మూకాశ్మీర్ ప్రజల న్యాయబద్ధమైన ఆకాంక్షలను రెండింటినీ కాపాడుతుంది’ అని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా తీర్మానానికి స్వతంత్ర ఎమ్మెల్యేలు షేక్ ఖుర్షీద్, షబీర్ కుల్లారు, పీపుల్స్ కాన్ఫరెన్స్ (పిసి) చీప్ సజాద్ లోన్, పిడిపి శాసనసభ్యులు మద్దతు ఇచ్చారు. బిజెపి నేత శర్మ నేతృత్వంలోని నేతలు ఈ తీర్మానానికి అభ్యంతరం తెలిపారు. నోటీసు లేకుండా తీర్మానాన్ని ప్రవేశపెట్టారని వారు వాదించారు. కాగా, బీజేపీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర ప్రత్యేక హోదాను రద్దుచేసింది. 370 అధికరణ రద్దుతో దాదాపు పదేళ్లకుపైగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజనకు గురైంది. అయితే తాజాగా ఎన్నికైన ప్రభుత్వం మళ్లీ ప్రత్యేక హోదా పునరుద్ధరణకు పూనుకుంది.
Read Also: US Presidential Elections : అమెరికన్లకు స్వర్ణయుగమే – డొనాల్డ్ ట్రంప్