Pakistan : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్..రక్షణ బడ్జెట్ భారీగా పెంచిన పాక్..!
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ డిమాండ్లను తీరుస్తూ ఈ నిర్ణయం తీసుకుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ కొత్త బడ్జెట్‌లో రక్షణశాఖకు 9 బిలియన్ డాలర్లు కేటాయించగా, అదే సమయంలో ఇతర ప్రభుత్వ విభాగాల్లో 7 శాతం ఖర్చులను తగ్గించింది.
- By Latha Suma Published Date - 01:15 PM, Wed - 11 June 25

Pakistan: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వేళ, అభివృద్ధిని పణంగా పెట్టి ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెడుతోంది. తాజాగా ఆ దేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రక్షణ బడ్జెట్ 20 శాతం మేర పెరిగింది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’లో జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ పెంపు చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ డిమాండ్లను తీరుస్తూ ఈ నిర్ణయం తీసుకుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ కొత్త బడ్జెట్‌లో రక్షణశాఖకు 9 బిలియన్ డాలర్లు కేటాయించగా, అదే సమయంలో ఇతర ప్రభుత్వ విభాగాల్లో 7 శాతం ఖర్చులను తగ్గించింది. పర్యావరణ విభాగానికి కేటాయింపులు గణనీయంగా తగ్గించబడినవి.
Read Also: Barla Srinivas : మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత బహిష్కరణ
పర్యావరణ విపత్తుల పరంగా ప్రపంచంలో అత్యధిక ప్రభావిత దేశాల్లో ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ, పాక్ ప్రభుత్వం ఈ విభాగాన్ని విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2022లో వచ్చిన వరదలతో పాకిస్థాన్‌లో 3.3 కోట్ల మందికి పైగా ప్రభావితమయ్యారు. దాదాపు 15 బిలియన్ డాలర్ల ఆస్తినష్టం జరిగింది. వర్తమాన ఆర్థిక పరిస్థితుల్లో ప్రకృతి విపత్తులు జీడీపీలో 18-20 శాతం వరకు నష్టాన్ని కలిగించవచ్చని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. అయినా కూడా పాక్ మాత్రం ఆయుధాల దిశగానే నడుస్తోంది. ఇటీవల భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్”తో పాక్ సైన్యంపై తీవ్ర ప్రభావం పడింది. ప్రత్యేకంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో లోపాలు బయటపడ్డాయి. HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, బైరక్తర్ టీబీ2 డ్రోన్లు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో పలు వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. దీంతో, వ్యూహాత్మకంగా సైనిక మార్పులు చేపట్టేందుకు రక్షణ బడ్జెట్‌ను పెంచారు.
ఈ నిధులతో ఆపరేషన్ సిందూర్ సమయంలో ధ్వంసమైన టెర్రర్ క్యాంపులను పునర్నిర్మించే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు, పాక్ ఈ ఏడాది ఆగస్టులో చైనా నుంచి 50 శాతం రాయితీ ధరకు జే-35 స్టెల్త్ జెట్ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. అదనంగా, 400 కిలోమీటర్ల పరిధి కలిగిన పీఎల్-17 క్షిపణులు, టైప్ 039బీ జలాంతర్గాములు, జిన్హా ఫ్రిగెట్‌లు కూడా పాక్ షాపింగ్ లిస్ట్‌లో ఉన్నాయి.