Mega Family: మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు రియాక్షన్ ఇదే..!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
- Author : Hashtag U
Date : 05-10-2022 - 6:10 IST
Published By : Hashtagu Telugu Desk
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు రియాక్ట్ అయ్యారు. తాను తప్పుకుని.. సైలెంట్ అయితేనే పవన్ ఉత్తమ నాయకుడు అవుతాడని అనుకుంటున్నట్లు చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు.
అన్నయ్య చిరంజీవి మాటలు కోట్లాది మంది తమ్ముళ్లు మనసులు గెలుచుకున్నాయి. అన్నయ్య ఆశీస్సులతో తమ్ముడు తప్పక పాలన పగ్గాలు చేపడతాడు. జనసైనికులుగా మేమంతా ఆ మహకార్యాన్ని నెరవేరుస్తాం. పవన్ నిజాయితీ, నిబద్ధతపై అన్నయ్య మాటలు మాలో మనోధైర్యాన్ని నింపాయి. పెంపొందించాయి అని నాగబాబు తెలిపారు.
తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్దతిస్తానని ఏనాడూ గట్టిగా చెప్పలేదని, భవిష్యత్‌లో ఇస్తానో.. లేదో తెలియదని చిరంజీవి అన్నారు. నా తమ్ముడి నిబద్ధత నిజాయితీ గురించి నాకు తెలుసు. ఎక్కడా కూడా వాటిని వదల్లేదు. నిజాయితీ గల నాయకులు మనకు కావాలి. అలాంటి వారు రావాలని నా ఆశ. నేనొక పక్కన.. తానొక్క పక్కన ఉండేకంటే నేను తప్పుకుని, సైలెంట్ అయిపోతేనే పవన్ బెస్ట్ నాయకుడు అవుతాడని అనుకుంటున్నాను అని చిరంజీవి అన్నారని తెలిసిందే.
నాగబాబు ప్రస్తుతం సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూనే.. కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా చూసుకుంటే జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. మెగా కుటుంబం నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో నాగబాబు ఒక్కరే పీఏసీ సభ్యుడిగా ఉన్నారు. జనసేన పార్టీపై, పవన్ కల్యాణ్‌పై అధికార పార్టీ నాయకులు చేసే కామెంట్స్‌కు ధీటుగా సెటైర్లు వేస్తుంటారు మెగా బ్రదర్ నాగబాబు.