Nara Lokesh : లోకేశ్‌కు డిప్యూటీ సీఎం..జనసేన కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని జనసేన కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, జనసేన నేతలు సైతం ఈ అంశంపై మరో వాదన వినిపిస్తున్నారు.
- By Latha Suma Published Date - 05:25 PM, Tue - 21 January 25

Nara Lokesh : గత కొన్ని రోజులుగా ఏపీలో మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ టీడీపీ నేతల నుంచి బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఈ అంశం టీడీపీతో సహా ఇటు జనసేనలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇరు పార్టీల నేతలు ఎవరికి తోచిన రీతిలో వారు స్పందిస్తుండగా.. తాజాగా జనసేన పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంపై స్పందించింది. ఈ అంశంపై పార్టీకి చెందిన నేతలెవరూ బహిరంగంగా స్పందించవద్దని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని జనసేన కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, జనసేన నేతలు సైతం ఈ అంశంపై మరో వాదన వినిపిస్తున్నారు. లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేస్తే తమకు ఓకే కానీ పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలని జనసేన కార్యకర్తలు గట్టిగా కోరుకుంటున్నారని ఆ పార్టీ నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ అంశంపై టీడీపీ అధిష్టానం కూడా రియస్‌గా స్పందిస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అధిష్టానం నేతలకు అత్యుత్సాహంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కూటమి నేతలతో చర్చించిన తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. కాగా, కడప జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి స్టేజ్‌పై మాట్లాడుతూ.. నారా లోకేష్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఈ డిమాండ్‌ను మద్దతు తెలుపుతూ, లోకేష్ టీడీపీకి కోటి సభ్యత్వాలను సాధించడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఆయన ‘యువగళం’తో ప్రతిపక్షాలకు గట్టి సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.
మంత్రి టీజీ భరత్ కూడా లోకేశ్ ఫ్యూచర్ సీఎం అంటూ సీఎం చంద్రబాబు సమక్షంలోనే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వారు దావోస్ పర్యటనలో ఉండగా.. సోమవారం జ్యురిచ్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి టీజీ భరత్.. లోకేశ్ సీఎం అవుతారని అన్నారు. టీడీపీలో ఫ్యూచర్ లీడర్ లోకేశ్ అని.. ఎవరికి నచ్చినా… నచ్చకపోయినా.. ఇది జరిగి తీరుతుందని మంత్రి స్పష్టం చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేశేనని పేర్కొన్నారు. ఇక ఈ పరిణామాలన్నింటినీ బీజేపీ నిశితంగా గమనిస్తోంది.
Read Also: Rashmika Chava Look : మహారాణి లుక్ లో రష్మిక