Hydraa : పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం..ఇదే హైడ్రా తీరు – కేటీఆర్
Hydraa : “హైడ్రా రాత్రి వేళల్లో ఇళ్లను కూల్చడం ఎందుకు? ఇది న్యాయపరమైన చర్య అయితే, నోటీసులు ఇవ్వడానికి ఏమిటి భయం?” అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే నిలిచిందని, ఎవరిపైనా అన్యాయం జరగకుండా
- By Sudheer Published Date - 03:46 PM, Sun - 2 November 25
హైదరాబాద్‌లో “పెద్దవాళ్లకు ఒక న్యాయం… పేదవాళ్లకు ఒక న్యాయం” అనే నినాదంతో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రేరణతో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హైడ్రా చర్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యానిస్తూ, హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో ప్రభుత్వం అన్యాయాలు, అరాచకాలు చేస్తున్నదని ఆరోపించారు. చాంద్రాయణగుట్టలో పేదవారి స్కూల్‌ను కూడా కూల్చేశారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం అంతా అభివృద్ధి పనులతో నిండిపోయిందని, లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు, సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, నీటి ప్రాజెక్టులు, కలెక్టర్ కార్యాలయాలు అన్నీ నిర్మించినట్లు గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో ఒక ఇటుక కూడా వేయలేదని, కూల్చడమే తప్ప కొత్తగా ఏది చేయలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Vijay Karur Stampede : నటుడు విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు!
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చి, పెద్దవారి నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. భట్టి విక్రమార్క ప్రజెంటేషన్‌లో బిల్డర్ల పేర్లు ఉన్నప్పటికీ, ప్రభుత్వం వారిపై చర్య తీసుకోలేదని అన్నారు. చెరువులలో, నదుల ఫుల్ ట్యాంక్ లెవెల్‌లో నిర్మాణాలు చేసిన మంత్రులు, నేతల ఇళ్లపై హైడ్రా ధైర్యం చూపలేదని ఉదాహరణలతో వివరించారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నేతల ఇళ్లు చెరువుల్లో ఉన్నప్పటికీ, వారిపై నోటీసులు లేవని కేటీఆర్ మండిపడ్డారు. పేదవారిని మాత్రం రాత్రిళ్లు బుల్డోజర్లు పంపించి ఇళ్లను కూల్చుతున్నారని అన్నారు. “పేదల ఇళ్లను కూల్చడం న్యాయం అయితే, పెద్దల నిర్మాణాలపై మౌనం ఎందుకు?” అని ఆయన నిలదీశారు.
IND W vs SA W: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు వర్షం ముప్పు!
“హైడ్రా రాత్రి వేళల్లో ఇళ్లను కూల్చడం ఎందుకు? ఇది న్యాయపరమైన చర్య అయితే, నోటీసులు ఇవ్వడానికి ఏమిటి భయం?” అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే నిలిచిందని, ఎవరిపైనా అన్యాయం జరగకుండా చూసిందని చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పేదల ఇళ్లు కూల్చడం, ఆర్మీ కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టడం, న్యాయపరంగా దోపిడీ చేయడం జరుగుతోందని విమర్శించారు. “మూడు సంవత్సరాల చిన్నారి భోజనం లేక ఏడ్చే పరిస్థితి వస్తే, దానికంటే దారుణం ఇంకేముంటుంది?” అని ప్రశ్నించారు. 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పటికి హైడ్రా బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. “మా పదేళ్ల పాలనలో ఎవరికి అన్యాయం జరగలేదు అదే బాధ్యతతో మేము తిరిగి వస్తాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు.